రంగారెడ్డి జిల్లా కోహెడలో వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు ఏర్పాటు చేసేందుకు నోటిఫై చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కొత్తపేట గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌ను అబ్ధుల్లాపూర్‌మెట్ మండలం కోహెడకు తరలించాలన్న ప్రతిపాదన ఎప్పట్నుంచో ప్రభుత్వం పరిశీలనలో ఉంది. సర్వే నంబరు 507, 508లలో 59.83, 118.25 ఎకరాలు నోటిఫై చేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ మేరకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
అత్యంత రద్దీగా ఉండటం..
ప్రస్తుతం కొత్తపేటలో కొనసాగుతున్న గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ అత్యంత రద్దీగా ఉండటం వల్ల.. తరచూ హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా పరిసర ప్రాంతాల ప్రజలు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ మార్కెట్‌ను కోహెడకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం, మార్కెటింగ్ శాఖ ఎప్పుడో నిర్ణయించింది. అప్పట్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో కోహెడ్‌లో ప్రభుత్వ భూములు పరిశీలించి కేటాయించాలని నిర్ణయించారు.
తరలించేందుకు మార్గం సుగమం..
ఎట్టకేలకు ఆలస్యంగా నైనా.. గడ్డిఅన్నారం మార్కెట్ యార్డు తరలించేందుకు మార్గం సుగమమైంది. త్వరలో కోహెడ్‌లో ఆధునిక వసతులో కూడిన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం, యార్డు నిర్మించనున్నారు. రైతులు, వర్తకులు, ఎగుమతి దారుల సౌకర్యార్థం అది కార్యరూపం దాల్చితే.. అదొక హబ్‌గా మారి పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో శీతల గిడ్డంగులు, ప్రొసెసింగ్ యూనిట్లు కూడా రూపుదాల్చే సూచనలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చూడండి : 'జుమ్మేరాత్ బజార్లో సగం ధరకే అమ్ముతా...'