వందలాది మంది వ్యాపారులు, వేలాది మంది రైతులకు ప్రత్యక్షంగా... చిరువ్యాపారులు, కూలీలకు పరోక్షంగా ఆధారమైన గడ్డి అన్నారం మార్కెట్‌కు తాళాలు పడ్డాయి. 1986లో చైతన్యపురిలో 22 ఎకరాల్లో ఏర్పాటైన మార్కెట్ మూడు దశాబ్దాలకుపైగా సేవలందించింది. ఇప్పుడు ఈ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో తరలింపు అనివార్యంగా మారింది. బాటసింగారంలో ఏర్పాటుచేసిన లాజిస్టిక్‌పార్కు షెడ్లలో మార్కెట్‌ను ఏర్పాటుచేయనున్నారు. ఈ నెల 30లోగా ఖాళీ చేయాలని ఇప్పటికే గడ్డి అన్నారంలోని వ్యాపారులకు ఆదేశాలు అందాయి.
బాటసింగారానికి వెళ్లక తప్పని స్థితి..
జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యతో పాటు వివిధ కారణాలతో... మార్కెట్‌ను నగర శివారు ప్రాంతానికి తరలించాలని గతంలోనే నిర్ణయించారు. ఇందులో భాగంగానే కోహెడ వద్ద 178 ఎకరాల స్థలం కేటాయించి గత ఏడాదిన్నర కిందట తరలించారు. అప్పుడు వాన, గాలి దుమారానికి షెడ్లన్నీ కుప్పకూలిపోయాయి. దీంతో కోహెడలో మౌలిక సదుపాయాల కల్పన పూర్తి కాకపోవడం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో... బాటసింగారానికి తరలి వెళ్లక తప్పని పరిస్థితి.
తెలుగు రాష్ట్రాల్లోనే పెద్దది..
తెలుగు రాష్ట్రాల్లో గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ పెద్దది. ఉభయ రాష్ట్రాల్లో పండే మామిడి, బత్తాయి, జామ, సపోట, పుచ్చకాయ, దానిమ్మ రకరకాల పండ్లు ఇక్కడ క్రయవిక్రయాలు జరిగేవి. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి సంత్రా, ద్రాక్ష, హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్ నుంచి ఆపిల్ పండ్లకు గడ్డి అన్నారం ప్రసిద్ధి. అదే విధంగా ఇతర దేశాల పండ్లు సైతం లభ్యమయ్యేవి.
తరలింపు సరే కానీ..
గడ్డి అన్నారం నుంచి మార్కెట్ తరలింపుపై అభ్యంతరం లేదన్న వ్యాపారులు.. అన్ని సౌకర్యాలు కల్పించి... కోహెడకే పంపాలంటూ ఆందోళన బాటపట్టారు. నిరసన బాటపట్టిన వ్యాపారులకు మార్కెటింగ్ శాఖ అధికారులు అవగాహన కలిగిస్తున్నారు. వర్తక, హమాలీ సంఘాల నేతలతో సంప్రదింపులు చేస్తూ ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదీచూడండి: GaddiAnnaram Fruit Market : కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ ఖాళీ... ఇవాళ అర్ధరాత్రి తాళాలు