హైదరాబాద్‌లో రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సరూర్‌నగర్ పరిధిలోని కోదండరామ్ నగర్ వాసులు ఇళ్లలోకి నీళ్లు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఇళ్లలో ఉండలేని పరిస్థితులు తలెత్తుతున్నాయని కాలనీ వాసులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మురుగునీరంతా ఇళ్లలోకి చేరుతోందని గోడు వెల్లబోసుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోదండరామ్‌నగర్ వాసులు వేడుకుంటున్నారు.
వరదలు రావడం జరుగుతుంది. కానీ గత సంవత్సరం నుంచి ఇలా భారీగా వరదలు రావడం మొదటిసారి. కార్పొరేటర్‌కు కూడా ఎన్నో సార్లు చెప్పాం. ఈ వరదల వల్ల అనారోగ్యపాలవుతున్నాము. మా దగ్గర అద్దెకు ఉంటున్న వాళ్లందరూ వెళ్లిపోయారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడు లేడు.- బాధితురాలు, సరూర్‌నగర్
గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఖాళీ చేశాం. చనిపోతామని అనుకున్నాం... అంతా వరద వచ్చింది. నేను 1985 నుంచి ఇక్కడే ఉంటున్నా.. కానీ ఇంత వరద ఎప్పుడూ చూడలేదు. 10 చెరువుల నీళ్లు ఇక్కడికి వస్తాయి. మంచి నీళ్లలో వరద నీళ్లు కలుస్తున్నాయి. అదే నీరు తాగాలి. ఎలా బతకాలి..
- బాధితుడు, సరూర్‌నగర్
రాత్రంతా భారీ వర్షం.. రాత్రి ఇంట్లో పడుకోలేక వేరే వాళ్ల ఇంట్లో పడుకున్నాం. ఒకరోజు అంటే పడుకుంటాం. రోజూ అంటే ఎట్లా? డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు.. పాలకులు పట్టించుకోవడం లేదు. చాలా సార్లు జీహెచ్‌ఎంసీ అధికారులకు వినతి పత్రం ఇచ్చాం. కానీ పట్టించుకోలేదు. చాలా సార్లు వస్తున్నారు. చూసి వెళ్తున్నారు తప్ప... చర్యలు తీసుకున్నా దాఖలాలు లేవు.
- బాధితులు, కోదండరామ్‌నగర్ వాసులు
ఇదీ చదవండి: attendance in schools: సర్కారు బడుల్లో పెరిగిన హాజరు.. రెండో రోజు 39 శాతం