TSRTC Bus is fined : తెలంగాణ ఆర్టీసీకి రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. బస్సు ఆలస్యంగా బస్‌స్టేషన్‌కు రావడంతో పాటు గమ్యస్థానానికి చేరవేయడంలో మరింత జాప్యం చేసి ప్రయాణికురాలి అస్వస్థతకు కారణమైన టీఎస్‌ఆర్టీసీకి రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. టికెట్ డబ్బు రూ.631, పరిహారంగా రూ.1000, కేసు ఖర్చుల కింద రూ.500.. నెలన్నర రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది.
Penalty to TSRTC bus : హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఫహీమా బేగమ్ దిల్‌సుఖ్‌నగర్ నుంచి మణుగూరు వెళ్లేందుకు 2019 ఆగస్టులో టికెట్ బుక్ చేసుకున్నారు. ఆగస్టు 9న బస్టాండుకు వెళ్లగా రాత్రి 7.15కి రావాల్సిన బస్సు నాలుగు గంటలు ఆలస్యంగా 11.15కు వచ్చింది. మరుసటి రోజు ఉదయం 5.45కు చేరుకోవాల్సి ఉండగా 9.45కు గమ్యస్థానం చేరుకుంది. బస్టాండులోనే నాలుగు గంటలు వేచి ఉండటంతో ఫహీమా అస్వస్థతకు గురయ్యారు. ఆలస్యం కావడంపై డ్రైవర్‌ను ఆరా తీయగా దురుసుగా మాట్లాడాడు. దాంతో ఆమె రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఫిర్యాదుపై స్పందించిన ఆర్టీసీ.. ఆరోపణలు నిరాధారమని, ప్రయాణం రద్దయితేనే టికెట్ డబ్బు రీఫండ్ చేస్తామని, ఫిర్యాదిదారుకు నష్టం కలిగించేలా ఆర్టీసీ ప్రవర్తించలేదని తమ సేవల్లో లోపం లేదని వివరించింది.
సాక్ష్యాధారాలు పరిశీలించిన కమిషన్ అధ్యక్షురాలు చిట్నేని లతాకుమారి, సభ్యులు జీవీఎస్ ప్రసాద్‌రావు, డి.మాధవీలతతో కూడిన బెంచ్ బస్సు మణుగూరుకు 2 గంటల 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నట్లు గుర్తించింది. ఆలస్యం వల్ల ఫిర్యాదిదారు అస్వస్థతకు గురైనట్లు వైద్యుడు ధ్రువీకరించిన ప్రిస్కిప్షన్ సాక్ష్యంగా ఉందని, ఇది ముమ్మాటికీ సేవల్లో లోపమే అని పేర్కొంటూ టికెట్ డబ్బుతో పాటు పరిహారం చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది.