రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్‌నగర్ గ్రామంలో ఫార్మా భూ నిర్వాసితులకు అండగా ఉంటామని సీపీఎం ఆధ్వర్యంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్సీ సీతారాములు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని తమ్మినేని అన్నారు.
ఫార్మాసిటీ కోసం 14 గ్రామాల్లో 19 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తోందని, ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా భూములు తీసుకోవడం సరికాదన్నారు. భూసేకరణ చట్టం ప్రకారం భూములను తీసుకోవట్లేదని ఆరోపించారు. విషపూరిత ఫార్మా కంపెనీలతో పచ్చనిపంట పొలాల్లో చిచ్చుపెడుతున్నారని తెలిపారు. ఫార్మాసిటీకి వ్యతిరేకంగా తమ పార్టీ నాయకత్వంలో ఉద్యమించి భూములు కోల్పోతున్న రైతులకు అండగా ఉంటామని తమ్మినేని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: భాగ్యనగరంలో పేదల బతుకుల్ని చిదిమేసిన వర్షం