రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలోని పల్లె చెరువు కట్ట కోతకు గురైంది. ఎగువనున్న జల్ పల్లి, నవాబు చెరువుల నుంచి భారీగా వరదనీరు చెరువులోకి రావడంతో కట్ట దెబ్బతిని మట్టి కుంగిపోవడంతో దిగువనున్న అలీనగర్, ఆశామాబాద్ సహా పాతబస్తీలోని పలు కాలనీలు నీటమునిగాయి. కట్టపూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉండటంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం.. కాలనీవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
కలెక్టర్ అమయ్ కుమార్, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్, ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పల్లె చెరువు వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. సంబంధిత అధికారులతో చర్చించి మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు.
కట్టను పరిశీలించిన నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్.. వరద ఎక్కువ రావడంతో కోతకు గురైందని, 12 గంటల్లో మరమ్మతు పనులు పూర్తిచేయిస్తామని తెలిపారు. దిగువ ప్రాంత ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సజ్జనార్ సూచించారు.
మరోవైపు బాలాపూర్‌లోని గుర్రం చెరువుకు గండిపడింది. ఆ చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉండటంతో స్థానిక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
ఇదీ చదవండి: నిండుకుండలా నిజాం సాగర్ ప్రాజెక్టు.. 6 గేట్లు ఎత్తివేత