రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలో నందిగామ మండలం తాళ్లగూడ గ్రామంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళకు కరోనా ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది. ఫలితంగా పరిసర ప్రాంతాల్లోని ప్రజల్లో భయాందోళన నెలకొంది. చేగురులో వెలుగు చూసిన కేసు తర్వాత ఇది రెండోది నమోదైంది. గ్రామానికి చెందిన ఓ మహిళ గత కొద్ది నెలలుగా క్యాన్సర్‌తో బాధ పడుతూ చికిత్స పొందుతోంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతుండగా వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది.
హుటాహుటిన జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి , వైద్య బృందాలతో సహా రోగి గ్రామానికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులతో పాటు పలువురికి వైద్య పరీక్షలు చేశారు. తాళ్లగూడాతో పాటు పరిసర గ్రామలు అక్కివాని గూడ , మల్లాపూర్, తిమ్మపూర్, కుమ్మరిగుడా తదితర గ్రామాల్లో 250 మంది ఆరోగ్య సిబ్బందితో ఇంటింటి సర్వే నిర్వహించారు. బాధిత కుటుంబ సభ్యులను పరీక్షలకు తరలించిన అధికారులు ఆయా గ్రామాలకు రాకపోకలను నిలిపేశారు.