కరోనా మహమ్మారి ముంచుకొస్తోంది. రోజుకి దాదాపు 2 నుంచి 3 వేల మందికి పైగా వైరస్ బారిన పడుతున్నారు. అదే స్థాయిలో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో ప్రభుత్వ ప్రైవేటులో కలిపి సుమారు 15 వేల పడకలను అందుబాటులో ఉంచిన సర్కారు.. ఇప్పుడు ఐసోలేషన్ కేంద్రాలతో కలిపి సుమారు 30 వేలకు పెంచింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 27,861 యాక్టివ్ కేసులు ఉండగా... అందులో 9,176 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2,627 మంది ఉండగా.. ప్రైవేటులో 6,549 మంది ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రైవేటులో ఒక్కో పడకకు రోజుకి 4 వేల బెడ్ ఛార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది. ఇక మందులు, డాక్టర్ ఫీజు, నర్సింగ్ సేవలు, పీపీఈకిట్‌లు అంటూ రోజుకు సుమారు పది వేలు అయ్యే అవకాశం ఉంది. అయినా ప్రజలు మాత్రం ప్రైవేటు వైపే మొగ్గు చూపుతున్నట్టు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి.
ప్రభుత్వాస్పత్రుల్లో తక్కువ పడకలు
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వాస్పత్రుల్లో 3,843 పడకలకు 2,649 అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటులో మాత్రం 4,754 పడకలకు ఖాళీగా ఉంది కేవలం 1,751 మాత్రమే. కరీంనగర్‌లో సర్కారు దవాఖానాలో 180 పడకలకు 92 ఖాళీ కాగా... ప్రైవేటులో 598కిగాను 389 అందుబాటులో ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం కేవలం 10 పడకలు మాత్రమే కొవిడ్ రోగులకు కేటాయించగా... మొత్తం అన్నీ ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటులో 585 మంది చికిత్స పొందుతుండటం గమనార్హం. నిజామాబాద్‌లో రోజుకు వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ జిల్లాలో ప్రభుత్వాస్పత్రుల్లో 561 పడకలకు ఖాళీగా ఉన్నవి కేవలం 214 మాత్రమే... ప్రైవేటులోనూ 297 పడకలకు 266 ఇప్పటికే నిండుకున్నాయి.
కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం సర్కారు ఆస్పత్రుల్లో వసతులు మెరుగుపరచింది. ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు చేపట్టింది. అయినా ప్రభుత్వాస్పత్రులకు వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది.
ఇదీ చూడండి : ఏదో ఒక రోజు తెలంగాణకి ముఖ్యమంత్రిని అవుతా: షర్మిల