Congress Six Guarantees Telangana 2023 : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహప్రతివ్యూహాలు, ప్రణాళికలు రచిస్తోంది. ఈసారి ఎలాగైనా కేసీఆర్‌ను గద్దె దించి.. తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనే పట్టుదలతో ఉన్న పార్టీ నేతలు ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. ఓవైపు పాదయాత్రలు.. మరోవైపు బస్సు యాత్రలు.. ఇంకోవైపు సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో విజయభేరి సభ నిర్వహించారు. ఈ సభకు సీడబ్ల్యూసీ సమావేశాల కోసం హైదరాబాద్‌కు వచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు హాజరయ్యారు.
విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలు ఇవే..
- 1. మహాలక్ష్మి పథకం(Mahalaxmi Scheme) : ఈ సభకు వచ్చిన సోనియా గాంధీ తెలంగాణ సోదరసోదరీమణులకు నమస్కారాలు అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నెరవేర్చేలా 6 గ్యారెంటీలు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆరు గ్యారెంటీలు తానే ప్రకటించకుండా మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి పథకాన్ని సోనియా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.2500 అందజేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనుంది. 500 రూపాయలకు వంటగ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నారు.

- 2. రైతు భరోసా పథకం(Rythu Bharosa Scheme) : దేశానికి అన్నం పెట్టే రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. రైతుల ప్రాణాలను కాపాడుకునేందుకు.. అన్నం పెట్టే అన్నదాత అభివృద్ధి కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రైతుభరోసా పథకం ప్రకటించారు. ఈ పథకం కింద ఎకరాకు రూ.15000 వేలు ఇస్తామని తెలిపారు. పట్టా భూమి రైతులతో పాటు కౌలు రైతులకు రూ.15 వేలు రైతుభరోసా ఇవ్వనున్నట్లు చెప్పారు. భూమిలేని నిరుపేదలు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు చెల్లిస్తామని వెల్లడించారు. వరి పంటకు క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్ అందజేస్తామని వివరించారు. అనంతరం ఖర్గే మాట్లాడుతూ సోనియాగాంధీ ఓట్ల కోసం తెలంగాణ ఇవ్వలేదని.. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చేందుకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని తెలిపారు.

- 3. గృహజ్యోతి పథకం(GruhaJyothi Schene) : ఈ పథకం కింద గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా అందజేయనున్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారికి 200 గజాల ఇంటిస్థలం ఇస్తామని ప్రకటించారు.

- 4. ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Inti Pathakam)
ఈ పథకం ప్రకారం గృహ నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం ఇవ్వనున్నారు.

- 5. యువ వికాసం పథకం(Yuva Vikasam Scheme)
కళాశాల విద్య పూర్తి చేసిన విద్యార్థులకు రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. యువ వికాసం కింద విద్యార్థులకు కోచింగ్ ఫీజు చెల్లించనున్నారు. అదే విధంగా 2 లక్షల ఉద్యోగాలు కల్పించనుంది.

- 6. చేయూత పథకం(Cheyutha Pension Scheme)
వితంతు మహిళలకు , చేనేత కార్మికులకు, వికలాంగులకు , వృద్ధులకు ఆసరా పథకం కింద 4 వేల పింఛను అందజేయనున్నారు. మరోవైపు దళిత, గిరిజన బంద్ కింద దళితులు, గిరిజనులకు రూ.12 లక్షల ఆర్థిక సాయం ఇవ్వనున్నారు. చేయూత పథకం కింద రూ.10లక్షల ఆరోగ్య బీమా అందజేయనుంది.

Rahul Gandhi At Vijayabheri Sabha : మహాలక్ష్మి పథకాన్ని సోనియా గాంధీ, రైతుభరోసా పథకాన్ని మల్లికార్జున ఖర్గే ప్రకటించగా.. గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువవికాసం, చేయూత పథకాలను విజయభేరి సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని.. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతిఫలం అంతా కేసీఆర్ కుటుంబమే అనుభవిస్తోందని అన్నారు. కేవలం ఒక్క కుటుంబం కోసమే సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వలేదని.. రైతులు, మహిళలు, విద్యార్థుల కోసం తెలంగాణ ఇచ్చారని తెలిపారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఎలాంటి మేలు జరగలేదని.. ప్రజలకు గ్యారెంటీ ఇచ్చి తెలంగాణ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అని వెల్లడించారు.
"తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మరోసారి గ్యారెంటీ ఇస్తోంది. ఆరు గ్యారంటీలు ఇస్తూ.. అధికారంలోకి రాగానే నెరవేరుస్తాం. వంద రోజుల్లో బీఆర్ఎస్ సర్కార్‌ను గద్దె దించటం ఖాయం. కాంగ్రెస్ సభకు ఆటంకం కలిగించేందుకు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ప్రయత్నించాయి. కాంగ్రెస్ సభ విజయవంతం కావొద్దని బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు ఇవాళే సభలు పెట్టుకున్నాయి. దేశంలో ప్రశ్నించిన వారిపై మోదీ సర్కారు ఎన్నో కేసులు పెట్టింది. తెలంగాణలో కేసీఆర్, ఓవైసీపై మోదీ సర్కార్ ఎలాంటి కేసులు పెట్టలేదు. తెలంగాణ సర్కార్ ఎంతో అవినీతిలో కూరుకుపోయింది. బీఆర్ఎస్ ఎంత అవినీతి చేసినా ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు పెట్టలేదు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పైకి విడిగా కనిపిస్తున్నా.. అంతా ఒక్కటే. పార్లమెంటులో బీజేపీ ఏం చెబితే దానికి భారాస, ఎంఐఎం మద్దతిస్తాయి. మోదీ కనుసైగ చేయగానే బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతు ఇస్తున్నాయి." అని రాహుల్ గాంధీ అన్నారు.
Tummala Join Congress : మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల