రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును కృష్ణా జలాలతో నింపి కబ్జాదారుల నుంచి కాపాడాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలోని చెరువుల సందర్శనలో భాగంగా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో సందర్శించారు. కబ్జాకు గురైన భూములను రైతులతో కలిసి పరిశీలించారు. వచ్చే వర్షాకాలంలోగా కృష్ణా , గోదావరి ప్రవహించని ప్రాంతాల చెరువులను నింపి వాటికి మరమ్మతులు చేపట్టాలని సూచించారు.
నదీ జలాలు ఎక్కడైతే లేవో అక్కడ ప్రాజెక్టుల ద్వారా నీటిని నింపాలన్నారు. భూగర్భ జలాలు తగ్గిపోకుండా ఉండాలంటే ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఈ చెరువులను నింపాలని మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నింపుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి విఫలమయ్యారని గుర్తు చేశారు.
ఆ విషయంలో సర్కార్ ఘోరం వైఫల్యం...
చెరువులను కబ్జాదారుల నుంచి కాపాడటంలో తెరాస సర్కార్ ఘోరంగా విఫలమైందని కోదండ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ రైతుల పక్షానే ఉంటుందని.. ఈ చెరువులను డిండి ప్రాజెక్టు ద్వారా నింపాలని డిమాండ్ చేశారు. హరీశ్ రావు మంత్రిగా ఉన్నప్పుడు ఈ చెరువులో పూడిక తీయడం కోసం వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినప్పటికీ ప్రయోజనం మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు.
ఈ మేరకు నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. రాబోయే భావితరాలకు చెరువులను అందించడం కోసం కాంగ్రెస్ కిసాన్ సెల్ పోరాటం చేస్తుందని జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి దండెం రాంరెడ్డి , లక్మీపతి గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : అంచున 'కమల్' సర్కార్- 12న కమలం గూటికి సింధియా!