CM KCR at Mucchinthal: త్వరలోనే రాష్ట్రంలో రెండు మహా క్రతువులకు ఏర్పాట్లు మొదలయ్యాయి. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ ఆశ్రమంలో చినజీయర్ స్వామిని ఆదివారం కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్... యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభం, అక్కడ నిర్వహించనున్న మహా సుదర్శన యాగం నిర్వహణపై చర్చించారు. యాదాద్రిలో మార్చి 28న జరిగే లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ.. దానికి ముందు 21 నుంచి మహా సుదర్శనయాగం నిర్వహించాలని ఇప్పటికే ముహూర్తం ఖరారు చేశారు. మార్చి 28 నుంచి గర్భాలయంలోని స్వయంభువుల నిజదర్శనాలు మొదలుకానున్నాయి. వీటికి సంబంధించిన ఏర్పాట్లు, ఆహ్వానాలు తదితర అంశాలపై.. చినజీయర్‌తో మాట్లాడారు.
శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు..
అలాగే ముచ్చింతల్ ఆశ్రమంలోని దివ్య సాకేతంలో.. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరగబోయే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు, సమతామూర్తి విగ్రహావిష్కరణ.. సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ యాగం ఏర్పాట్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. సమతాస్ఫూర్తిని చాటుతూ నిర్వహించనున్న రామనుజ సహస్రాబ్ది సంరంభం ఏర్పాట్ల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. శ్రీరామానుజ విగ్రహావిష్కరణ ఏర్పాట్ల గురించి స్వామి తెలియజేశారు. వెయ్యి 35 హోమగుండాలతో ప్రత్యేక యాగ నిర్వహణ.. రెండు లక్షల కిలోల ఆవు నెయ్యి, హోమద్రవ్యాల వినియోగం వంటి విశేషాలను వివరించారు. యాగశాల, ఇతరత్రా ఏర్పాట్లు, సమతామూర్తి విగ్రహాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. జీయర్ స్వామితో ప్రత్యేకంగా రెండు గంటల పాటు సమావేశమయ్యారు.
అధికారులకు ఆదేశాలు..
ముచ్చింతల్ యాగానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను... సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రముఖులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున వసతి, మెరుగైన సేవల కోసం యాగస్థలికి మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించాలన్నారు. అగ్నిమాపక శకటాలు సిద్ధంగా ఉంచాలని నిర్దేశించారు. మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలన్న ముఖ్యమంత్రి... ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితోనూ ఫోన్‌లో మాట్లాడారు. యాగం జరిగే రోజుల్లో నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు.
ఇవీ చూడండి: