రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని తంగెడుపల్లిలో హత్యకు గురైన మహిళను ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలింది. మహిళ చేతులను తాళ్లతో కట్టేసి... మెడకు ఉరి బిగించి హత్య చేసినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. మహిళకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగినట్లు వైద్యులు భావిస్తున్నారు. మృతురాలికి ధూమపానం అలవాటున్నట్లు పోస్టుమార్టంలో తేలింది. మహిళ మృతదేహాన్ని చేవేళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో భద్ర పరిచారు. వివరాలు తెలిసిన తర్వాత మృతదేహాన్ని వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పారు.
విస్రా, డీఎన్ఏలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు..
మృతురాలి నుంచి సేకరించిన విస్రా, డీఎన్ఏను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. సంఘటనా స్థలంలో మహిళ శరీరంపై ఉన్న గొలుసు, చేతి ఉంగరం, చేతి గాజుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు గుజరాత్ లేదా మహారాష్ట్రకు చెందిన మహిళ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు దారి తీశాయా అనే కోణంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఆమె చేతికి ఉన్న ఉంగరాన్ని బట్టి ఏ ప్రాంతం మహిళలు ఈ తరహా బంగారాన్ని ఉపయోగిస్తారనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. బృందాలుగా ఏర్పడిన పోలీసులు రాష్ట్ర సరిహద్దులలోని టోల్ గేట్ల వద్ద వివరాలు సేకరిస్తున్నారు. నాలుగు వాహనాలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నాలుగు వాహనాలు ఏ ప్రాంతాలకు చెందినవో తెలుసుకునే పనిలో పడ్డారు. మృతురాలి వివరాలు తెలిస్తే... పోలీసుల దర్యాప్తులో పురోగతి లభించే అవకాశం ఉంది.
ఇవీ చూడండి: రైతు రుణమాఫీకి నిధుల విడుదల