పొంచి ఉన్న మూడో దశ కొవిడ్ ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు అందుబాటులోని అన్ని వనరులను వినియోగించుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రాలకు సూచించింది. పీజీ వైద్య విద్య నీట్ పరీక్ష కోసం సిద్ధమవుతున్న విద్యార్థులను, ఇంటర్న్‌షిప్ చేస్తున్న వారినీ, ఇంకా అవసరమైతే ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థులనూ వినియోగించుకోవాలని ఆదేశాలు జారీచేసింది. బీఎస్సీ, జీఎన్‌ఎం అర్హత ఉన్న నర్సులను పూర్తిస్థాయిలో కొవిడ్ సేవల్లో ఉపయోగించవచ్చని స్పష్టంచేసింది.
అన్ని రాష్ట్రాలకూ కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ...
మూడోదశ ముప్పును ఎదుర్కొనేందుకు అవసరమైన సాంకేతిక సాయాన్ని అందజేస్తామని తెలిపింది. తగినన్ని మందులు, ఆక్సిజన్, ఇతర వైద్య వినియోగ పరికరాలను, మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి సహకరిస్తామని వెల్లడించింది. ఈ మేరకు తాజాగా అన్ని రాష్ట్రాలకూ కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది.
తాజా మార్గదర్శకాలివీ..
- మూడోదశ కొవిడ్‌ను ఎదుర్కోవడంలో మూడంచెల విధానాన్ని అనుసరించాలి.
- కొవిడ్ కేర్ సెంటర్(సీసీసీ), డెడికేటెడ్ కొవిడ్ హెల్త్ సెంటర్(డీసీహెచ్‌సీ), డెడికేటెడ్ కొవిడ్ హాస్పిటల్(డీసీహెచ్) విధాన అమలును కొనసాగించాలి.
- పారిశ్రామిక ఆక్సిజన్ వాడకంపై ఆంక్షలు విధించినందున ఆ మేరకు రాష్ట్రాలు కఠినంగా వ్యవహరించాలి.
- వైద్య ఆక్సిజన్ వృథా కాకుండా ఉండటానికి, హేతుబద్ధంగా వాడకంపై నిఘా కొనసాగించాలి.
- స్థానికంగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి అనుగుణంగా ఆసుపత్రుల్లో పీఎస్‌ఏ ప్లాంట్లు స్థాపించాలి.
- కొవిడ్ డ్రగ్స్ మేనేజ్‌మెంట్ సెల్(సీడీఎంఎసీ)ను ఏర్పాటు చేసి మందుల సరఫరా సజావుగా జరిగేలా పర్యవేక్షించాలి. కరోనా ఔషధాలకు సంబంధించిన అన్ని సమస్యలపై సమర్థంగా నిర్ణయం తీసుకోవటానికి డ్రగ్స్ కోఆర్డినేషన్ కమిటీ(డీసీసీ)ని ఏర్పాటు చేయాలి.
- అవసరాలకు తగినంతగా ఔషధాలను నిల్వ చేసుకోవాలి.
- నల్లబజారులో రెమ్‌డెసివిర్ అమ్మకాలను అరికట్టాలి. అత్యవసర వినియోగం కింద ఎంపిక చేసిన రోగులకు మాత్రమే దీన్ని ఇవ్వాలి.
- యాంఫోటెరిసిన్ బి(లైపోసోమల్) లభ్యతను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలి.
- అన్ని జిల్లాల్లో వైద్యులను టెలీ విధానంలో సంప్రదించేలా వ్యవస్థను అభివృద్ధి చేయాలి.
- టీకాలను ఎక్కువ మందికి వేసేలా ప్రణాళిక రచించాలి.
- కొవిన్ యాప్‌లో ప్రజల సందేహాలను తీర్చడానికి కాల్‌సెంటర్‌ను నెలకొల్పాలి.
ఇదీ చూడండి: Crop Insurance : పంట బీమా అమల్లో ఉన్నా.. అన్నదాతలకు అన్యాయం