మునుగోడులో ఓడిపోతామనే భయంతో కేసీఆర్ పెద్ద డ్రామాకు తెరలేపారని భాజపా రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు. భాజపాపై తెరాస చేస్తున్న ఆరోపణలను వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా హస్తినాపురం చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మునుగోడులో ఓటమి భయంతో ప్రజలను పక్కదారి పట్టించేందుకు తెరాస ప్రభుత్వం చూస్తోందని సామ రంగారెడ్డి విమర్శించారు. అందుకే భాజపా నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు బేరాలు చేసిందంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
భాజపాకు ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం లేదని.. పార్టీ సిద్దాంతాలు నచ్చిన వారు స్వయంగా పార్టీలోకి వస్తారని సామ రంగారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను తెరాస కొనుక్కుని వారికి మంత్రి పదవులు ఇచ్చిందని.. ఆ రంగును భాజపాకు పూసే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. ఏదేమైనా మునుగోడులో భాజపా గెలవడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మొద్దు లచ్చిరెడ్డి, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, పలువురు భాజపా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: ఓవైపు కొనుగోలు ప్రకంపనలు.. మరోవైపు జోరుగా ప్రచారం.. మునుగోడులో ఎవ్వరూ తగ్గేదే లే
యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద రణరంగం.. తెరాస, భాజపా కార్యకర్తల బాహాబాహీ
'రాష్ట్రంలో ఏ క్షణమైనా ఆటం బాంబు పేలుతుంది'.. గవర్నర్ కీలక వ్యాఖ్యలు!