Bjp Cadre Josh On Success: పాదయాత్రలతో రాజకీయాలనే మార్చేసిన చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలకు ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికార తెరాసను గద్దె దించి, భాజపా జెండా ఎగురవేయటమే లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో విడుతల వారీగా పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే 2 విడతల్లో పూర్తైన ఈ యాత్ర... రాష్ట్ర కమలదళంలో జోష్‌ను నింపింది. గత ఏడాది ఆగస్ట్ 28న హైదరాబాద్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద ప్రారంభించిన మొదటి విడత పాదయాత్ర... హుస్నాబాద్‌లో ముగిసింది. ఏప్రిల్ 14న అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన రెండో విడుత పాదయాత్ర.... 5 జిల్లాలు, 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 31 రోజుల పాటు సాగింది. రెండో విడత గద్వాల, వనపర్తి, నారాయణపేట మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో.. అలంపూర్, గద్వాల, మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో సాగింది. సంజయ్ ఈ పాదయాత్రలో 383 కిలోమీటర్ల దూరం నడవగా... సగటున రోజుకు 12.3 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
బండి సంజయ్ పాదయాత్రలో ప్రజల నుంచి దాదాపు 18 వేల వినతి పత్రాలు వచ్చినట్లు భాజపా వర్గాలు తెలిపాయి. ఆయన 22 గ్రామసభల్లో పాల్గొన్నారని.. కులవృత్తుల వారితో 21 సమావేశాలు నిర్వహించారని పేర్కొన్నాయి. రెండో విడతలో రచ్చబండ, ఛాయ్ పే చర్చ వంటి చిన్న చిన్న సమావేశాలకు ప్రాధాన్యం ఇస్తూ.... ప్రజలతో మమేకం అయ్యారు. మండుటెండలు ఉన్నప్పటికీ నడక కొనసాగించారు. యాత్రలో గుర్తించిన సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ఒత్తిడి చేయాలని నిర్ణయించారు. ఈ సారి సంజయ్ పాదయాత్రలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, భూపేంద్ర యాదవ్, తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
అలంపూర్‌లో మొదలైన రెండో విడత పాదయాత్ర... నిన్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో ముగిసింది. యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభకు పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరుకాగా... భారీసంఖ్యలో జనం తరలివచ్చారు. అనంతరం, తుక్కుగూడ సభలో అమిత్‌షా సహా పార్టీ నేతలు ఉద్వేగభరితమైన ప్రసంగాలు చేశారు. తొలి విడత పాదయాత్ర విద్య, వైద్యరంగాలపై దృష్టిపెట్టి హామీలివ్వగా... రెండో విడత యాత్ర ముగింపు సభలో ఇళ్ల నిర్మాణం, రైతులు, నిరుద్యోగులకు భరోసా కల్పించారు. పాదయాత్ర విజయవంతంతో పాటు పార్టీ జాతీయ నేతల రాక, భారీగా జనసమీకరణతో రాష్ట్ర కమలదళం ఎన్నికల కదనరంగంలోకి దూకింది.
ఇవీ చూడండి: 'తెలంగాణలో నిజాం ప్రభువును గద్దె దించేందుకు సిద్ధమవ్వండి..'
"జనగణమనలో 'సింధ్'ను తొలగించండి.. పాక్‌ను కీర్తిస్తూ పాడేదెలా?"