Bhatti Vikramarka on Praja Palana Program : పదేళ్లలో రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు పొందలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అన్నారు. అందుకే ప్రజల దగ్గరకు వెళ్లి ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి చేస్తున్న కార్యక్రమమే ప్రజాపాలన అని చెప్పారు. తమది ప్రజల ప్రభుత్వమని, దొరల సర్కార్ కానే కాదని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ క్రమంలోనే అభయహస్తం దరఖాస్తులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు.
Praja Palana Program Rangareddy 2023 : "ప్రజల చేత ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం మనది. ప్రజాపాలన అందిస్తామని చెప్పి ప్రజలను ఒప్పించి ప్రభుత్వం ఏర్పాటు చేశాం. మేం ఇచ్చిన ఆరు గ్యారెంటీవలను ప్రజల సమక్షంలో అమలు చేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని, సంపదను ప్రజలకు అంకితం చేస్తాం. ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టి దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించాం. ప్రజలు ఎవరు ఇబ్బందిపడాల్సిన అవసరం లేదని" భట్టి విక్రమార్క అన్నారు.
ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలులో అధికారులదే కీలక పాత్ర : సీఎం రేవంత్ రెడ్డి
ప్రజల దగ్గరకే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. తాను పాదయాత్ర చేసిన సమయంలో మహిళలు వారి సమస్యలు చెప్పుకున్నారని వివరించారు. గతంలో కాంగ్రెస్ పంచిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఒక్క రేషన్ కార్డుకు దరఖాస్తు తీసుకోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ గౌతమ్, తదితరులు పాల్గొన్నారు.
"ఒక వర్గానికి, ఒక వ్యక్తికి సంబంధించిన ప్రభుత్వం కాదు మాది. మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తామని బెదిరించే ప్రభుత్వం కాదు మాది.ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేసి తీరుస్తాం. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తాం. అర్హత కలిగిన వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు." - భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి
మరోవైపు హైదరాబాద్ బంజారాహిల్స్ సీఎంటీసీలో ప్రజాపాలన కార్యక్రమాన్ని (Praja Palana in Telangana)మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 6 వరకు అర్జీల స్వీకరణ జరుగుతుందని తెలిపారు. ప్రజలకు సందేహాలుంటే అధికారులతో సమాచారం తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా దరఖాస్తు చేసుకోవాలని, ప్రజల వద్దకే పాలన పేరుతో ఈ కార్యక్రమం జరుగుతుందని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఎలాంటి పైరవీలకు అవకాశం లేదు : అర్హతను బట్టి లబ్ధి జరుగుతుందని, ఎలాంటి పైరవీలకు అవకాశం లేదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో 600 కేంద్రాల్లో ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దరఖాస్తులు తీసుకుంటారని, మిగతా సమస్యలపై కూడా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. హైదరాబాద్ నగరం రాష్ట్రానికే ఆదర్శంగా ఉండేలా కార్యక్రమం జరుగుతుందని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ప్రజాపాలన దరఖాస్తు ఎలా నింపాలి? - ఏయే డాక్యుమెంట్లు అవసరం?
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కాంగ్రెస్ గ్యారెంటీలు ప్రారంభం - సద్వినియోగం చేసుకోవాలన్న నేతలు