రంగారెడ్డి జిల్లా కందుకూరు, కడ్తాల్ మండలాల్లోని 19 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న ఔషధనగరి నిర్వాసితులకు అత్యుత్తమ పరిహారం, పునరావాసం కల్పించేందుకు సర్కార్ సిద్ధమైంది. భూములిచ్చిన రైతులకు... ఎకరానికి 121 గజాల నివాసస్థలంతో పాటు కుటుంబానికో ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఔషధనగరిలో మొత్తం 19,400 ఎకరాలను గుర్తించిన ప్రభుత్వం.... అందులో 9, 400 ఎకరాల ప్రభుత్వ భూమి పోగా... మరో 10వేల ఎకరాల ప్రైవేటు, అసైన్డ్ భూములను సేకరించింది. ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ... మంత్రి కేటీఆర్ అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. ఈ మేరకు నివాస స్థలం, ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు.
ఉద్యోగాల కల్పన
మీర్‌ఖాన్‌పేటలో 600 ఎకరాలను గుర్తించి... అక్కడ నిర్వాసితుల కోసం అత్యుత్తమ సౌకర్యాలతో టౌన్‌షిప్ నిర్మించాలని నిర్ణయించారు. ఔషధనగరి ప్రాజెక్టు కంటే ముందే.. దీనిని నిర్మిస్తారు. యువతకు నైపుణ్య శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి..., ఉద్యోగాల కల్పనకు కృషి చేయాలని నిర్ణయించారు. అత్యుత్తమ సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్న టౌన్‌షిప్‌లో.... ప్రాజెక్టు కోసం కోల్పోయే ప్రతి ఎకరానికి... 121 గజాల స్థలాల చొప్పున రైతులకు కేటాయిస్తారు. ఎకరానికంటే అదనంగా భూమి ఇస్తే... దానికి సైతం స్థలం ఇస్తారు. రహదారులు, భూగర్భ మురుగునీటి పారుదల, విద్యుత్, టెలీకాం లైన్ నిర్మిస్తారు. సమీకృత మార్కెటు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రం, సామూహిక భవనం, దుకాణాల సముదాయంతో పాటు ప్రతి సెక్టార్‌లో డంపింగ్ యార్డులుంటాయి. ఔషధనగరిలో పరిశ్రమలు, విశ్వవిద్యాలయ ఉద్యోగులకు నిర్మించే టౌన్‌షిన్లు దీనికి సమీపంలో ఉంటాయి.
100 కోట్లు కేటాయింపు
ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఔషధనగరితో కందుకూరు, యాచారం మండలాలు మరో హైటెక్‌సిటీగా మారుతాయని... విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఔషధనగరి ఏర్పాటులో భాగంగా భూ నిర్వాసితులకు ప్లాట్ల కేటాయింపు కోసం.... 600 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న మెగా లే అవుట్ పనులను ఆమె ప్రారంభించారు. అంతకు ముందు మోడల్ లేఅవుట్‌ను పరిశీలించిన మంత్రి... దీని అభివృద్ధికి 100 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఔషధనగరి భూమిపూజకు ముందే లే అవుట్ అభివృద్ధి చేసి ప్లాట్లు కేటాయిస్తామన్నారు.
నిర్వాసితులకు న్యాయం
నిర్వాసితుల కుటుంబాల్లోని యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు నెలలోపు యాచారం, కందుకూరులో శిబిరాలను ఏర్పాటు చేయాలని....టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డిని మంత్రి ఆదేశించారు. అవార్డు జారీతో కాకుండా.... రైతుల అంగీకారంతోనే పరిహారం ఇస్తే వారికి న్యాయం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కోరగా... పరిహారం చెల్లించేందుకు నిధులు సిద్ధంగా ఉన్నాయని, రైతుల వద్దకే వచ్చి అధికారులు అందజేస్తారని చెప్పారు.
ఇదీ చూడండి : 'కేసీఆర్కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే తెరాస ఏర్పాటయ్యేదా?'