Adibatla Kidnap Case Updates: రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో దంత వైద్య విద్యార్థిని కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు కొడుదుల నవీన్‌రెడ్డి వీడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఈ నెల 9న యువతిని కిడ్నాప్ చేసిన అతడు నల్గొండ వెళ్లే మార్గంలో ఆమెను వదిలేసి గోవా చేరాడు. అక్కడ హోటల్‌లో బస చేశాడు. హోటల్‌లోని రూమ్ బాయ్ ద్వారా వీడియో తీయించాడు. దాన్ని పెన్‌డ్రైవ్‌లో ఉంచి.. హైదరాబాద్‌కు వస్తున్న బస్‌డ్రైవర్‌కు అప్పగించాడు. గురువారం ఉదయం ఆ వీడియో సామాజిక మాధ్యమాల ద్వారా మీడియాకు చేరింది. 58 నిమిషాల వ్యవధి గల వీడియో ద్వారా నవీన్‌రెడ్డి పలు అంశాలు వివరించాడు.
‘‘ఎంతోకాలంగా తామిద్దరం కలిసి తిరిగాం. ఆ యువతి తల్లిదండ్రులే మమ్మల్ని దూరం చేశారు. తాను సంపాదించిన సొమ్ముతో ఖరీదైన వస్త్రాలు, సౌందర్య ఉత్పత్తులు కొనుగోలు చేసింది. సన్నిహితంగా ఉన్న మమ్మల్నిద్దర్నీ దూరం చేసేందుకు యువతి మేనమామ, తల్లి పన్నాగం వేశారు. 5-6 నెలలు తనను కలవకుండా దూరం చేశారు. ఇంటికెళ్లినా, కళాశాలకు వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నించినా పోలీసు కేసుతో భయపెట్టారు. కొద్దిరోజులుగా ఆమెకు ఎన్నారై పెళ్లి సంబంధాలు వస్తున్నట్టు తెలిసింది. ఈ నెల 9న మన్నెగూడలోని యువతి ఇంట్లో నిశ్చితార్థం జరగబోతోందని 8వ తేదీ రాత్రి తెలిసింది. దాన్ని అడ్డుకొని ఆమెతో మాట్లాడాలనే ఉద్దేశంతో వెళ్లాను.
‘మిస్టర్ టీ’ దుకాణాల్లో పనిచేసే 20 మందిని సహాయంగా తీసుకొని యువతి ఇంటికి చేరాను. ఆమెతో మాట్లాడాలనే ఉద్దేశంతో బలవంతంగా కారులోకి ఎక్కించుకొని తీసుకెళ్లాను. రెండుసార్లు ఆ యువతి కారులో నుంచి దూకేందుకు ప్రయత్నించటంతో ఆపాను. కొట్టలేదు. ముఖాన్ని వెనక్కి నెట్టినపుడు గోరు తాకింది.’’ పర్యాటక ప్రాంతాలకు తాము కలసి వెళ్లిన అంశాలను పంచుకున్నాడు. కిడ్నాప్ చేశాక ఆమె ఇంటి వద్దే వదిలేద్దామని భావించినా, పోలీసులకు లొంగిపోతే ప్రమాదకరమనే ఉద్దేశంతో న్యాయవాది సలహా కోసం ప్రయత్నించినట్టు పేర్కొన్నాడు. సమయానికి ఆ న్యాయవాది స్పందించకపోవటంతో యువతిని మార్గం మధ్యలో వదిలేసి వెళ్లినట్టు తెలిపాడు. ఇంతకాలంగా తమ మధ్య జరిగిన విషయాలు బయటి ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతోనే వీడియో తీసి పంపానంటూ పేర్కొన్నాడు.
పోలీసుల కస్టడీ పిటిషన్: కిడ్నాప్ కేసులో నవీన్‌రెడ్డిని 8 రోజులు, ఏ5 నిందితుడు చందును 5 రోజుల కస్టడీ కోరుతూ గురువారం ఆదిభట్ల పోలీసుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం శుక్రవారం నిర్ణయం వెలువరించనుంది. ఈ కేసులో ఈ నెల 10న అరెస్ట్ చేసిన ఐదుగురు నిందితులను 2 రోజులు కస్టడీకి కోరారు.
స్నేహితులం మాత్రమే: కిడ్నాప్ చేసి తన పట్ల దారుణంగా ప్రవర్తించిన నవీన్‌రెడ్డి ప్రవర్తనతో విసిగిపోయానంటూ బాధిత యువతి ఆవేదన వెలిబుచ్చారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. తామిద్దరం స్నేహంగా ఉన్నమాట వాస్తవమేనని అంగీకరించారు. నవీన్‌రెడ్డి వీడియోలో చెప్పేవన్నీ అవాస్తవాలంటూ కొట్టిపారేశారు. అతడు చేసే ప్రతి ఆరోపణ వెనుక కుట్ర దాగుందని, దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తాను ఒంటరిగా వెళ్లలేదన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి వెళ్లొచ్చినట్టు వివరించారు. సంబంధిత బిల్లులు ఉన్నట్టు పేర్కొన్నారు. నవీన్‌రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని, వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో బయటకు వస్తాయని తెలిపారు.
ఇవీ చదవండి: వైశాలి కిడ్నాప్ కేసు.. నవీన్‌రెడ్డిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
గ్రూప్-2, 3 ప్రకటనలకు కసరత్తు పూర్తి..
'పదేళ్లు గడిచినా.. నాటి పరిస్థితులే నేటికీ'.. నిర్భయ తల్లిదండ్రుల ఆవేదన