నవమాసాలు కనిపెంచిన బిడ్డ తన కాళ్లమీద తాను నిలబడితే అందరి కంటే ఎక్కువ సంతోషించేది కన్నవాళ్లే.. అలాంటిది ఒక్కగానొక్క కొడుకు జీవచ్ఛవంలా పడుంటే ఆ బాధ వర్ణణాతీతం. అలాంటి కష్టం పగవారికి కూడా రాకూడదనుకుంటారు. ప్రాణం మాత్రమే ఉండి కదలలేకుండా పడున్న ఈ యువకుడి పేరు కృష్ణ. రంగారెడ్డి జిల్లా ఆజీపూర్కు చెందిన మల్లప్ప, పద్మమ్మల ఒక్కగానొక్క కొడుకు. ఒక్కడే సంతానం అవ్వడం వల్ల చిన్నప్పటి నుంచీ గారాబంగా పెరిగాడు. డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం అతని జీవితాన్ని తలకిందులు చేయటమే కాకుండా ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది.
చిదిమేసిన ప్రమాదం
ఓ రోజు ట్రాక్టర్‌పై వెళ్తున్న సమయంలో కింద పడిపోయాడు. ట్రాక్టర్ చక్రం అతని నడుము పై నుంచి వెళ్లడం వల్ల కడుపు, నడుము భాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రాణాలు దక్కవనుకున్న సమయంలో ఉన్న ఐదెకరాల భూమిని తెగనమ్మి సుమారు రూ.50 లక్షలు ఖర్చుచేసి వైద్యం చేయించి కొడుకు ప్రాణాలు నిలుపుకున్నారు. ఉన్నదంతా ఊడ్చుకుని వైద్యం చేయిస్తే ప్రాణమైతే దక్కింది కానీ బతికున్న జీవచ్ఛవంలా మంచానికే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులను సంతోషపెట్టాల్సిన వయసులో వారికి భారంగా మారానంటూ కృష్ణ పడుతున్న ఆవేదన చూపరులను కన్నీరు పెట్టిస్తోంది.
ఆదుకోండి
కొడుకు నరకయాతన చూస్తోన్న ఆ తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం. ఇప్పటి వరకు ఐదు శస్త్ర చికిత్సలు చేశారు. అప్పట్లో మల, మూత్రాలకోసం రెండు సంచులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటిని తొలగించాల్సిన పరిస్థితి. దానికోసం సుమారు ఆరు లక్షల రూపాయలు అవసరం. దిక్కుతోచని స్థితిలో ఆ పేద తల్లిదండ్రులు సర్కారు సాయం కోసం సచివాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. కనీసం కదల్లేని పరిస్థితిలో ఉన్న కొడుకుని రోడ్డుపై పడుకోబెడ్డి సాయం కోసం యత్నిస్తున్నారు. దాతలెవరైనా ఆదుకోవాలని బాధితుడి కుటుంబీకులు దీనంగా వేడుకుంటున్నారు. కొడుకుకి వైద్యం చేయించలేక... ఆర్థిక కష్టాలను తట్టుకోలేక ఆ తండ్రి పడుతున్న మూగవేదన చూసైనా మనసున్న మారాజులు ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. జీవచ్ఛవంలా ఉన్న తన కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని అర్థిస్తున్నాడు.
ఇదీ చూడండి: తరుముకొస్తున్న మృత్యువు నుంచి తప్పించండి