Delivery in Hospital's Washroom : రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లికి చెందిన లోకుర్తి మాధవిని మొదటి కాన్పు కోసం బుధవారం సిరిసిల్లలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి, ప్రసవానికి ఇంకా 20 రోజుల గడువుందని వైద్యులు తెలిపారు. గురువారం నొప్పులు వస్తున్నాయని మాధవిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు.
ఆమె బాత్‌రూంలోకి వెళ్లగా అందులోనే ప్రసవం జరిగి, ఆడశిశువు జన్మించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆమెను బయటకు తీసుకొచ్చి చికిత్స అందించారు. శిశువు బాత్‌రూంలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రెండు రోజులు ఆసుపత్రి చుట్టూ తిరిగినా వైద్యాధికారులు పట్టించుకోలేదని బంధువులు మండిపడ్డారు.
ఇదే విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్‌రావును వివరణ కోరగా.. ప్రసవానికి ఇంకా 20 రోజుల సమయం ఉందని, కడుపులో శిశువు ఎదుగుదల సరిగా లేదని తెలిపారు. ఆపరేషన్ చేస్తే తల్లి ప్రాణానికి ప్రమాదమని, ముందు రోజే తాము చెప్పామన్నారు. గురువారం ఆసుపత్రిలో చేర్చుకోకముందే బాత్‌రూం కోసమని వెళ్లిన ఆమెకు అక్కడే ప్రసవం జరిగిందని, ఇందులో వైద్యుల తప్పిదం ఏమీ లేదని స్పష్టం చేశారు.