Boy Complaint on his Father: ఆ తండ్రి రోజూ తాగి వచ్చి తన భార్యను కొడుతున్నాడు. ఫలితంగా ఇంట్లో దంపతులిద్దరి మధ్య నిత్యం గొడవ జరుగుతోంది. దీన్ని చూడలేక మూడో తరగతి చదువుతున్న వాళ్ల కుమారుడు ఆ సమస్యను పరిష్కరించేందుకు చేసిన ధైర్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన జంగ దీపిక- బాలకిషన్ దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు భరత్, కుమార్తె శివాని. బాలకిషన్ ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా బాలకిషన్ మద్యానికి బానిసయ్యాడు. డ్రైవర్ పని మానేసిన బాలకిషన్.. మద్యం తాగేందుకు, కూలీ పనికి వెళ్తున్న దీపికను కొట్టి డబ్బులు లాక్కెళ్లటం చేస్తున్నాడు. పిల్లల ముందే భార్యను కొట్టడం, తిట్టడం చేస్తున్నాడు.
తల్లిని తండ్రి తరచూ కొట్టడాన్ని భరత్ తట్టుకోలేకపోయాడు. తల్లిని కొడుతున్న క్రమంలో అడ్డువెళ్లిన భరత్‌ను అతడి చెల్లెల్ని కూడా కొట్టాడు. తాగొచ్చి తల్లిని కొట్టటం.. దీంతో ఆమె ఏడవటం.. ఇదంతా భరత్‌కు ఎంతమాత్రం నచ్చలేదు. ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం చెప్పాలనుకున్నాడు. ఇంట్లో తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవలు ఆపేందుకు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించాడు. ఈ గొడవలకు ప్రధాన కారణం.. తన తండ్రి తాగి రావటమేనని ఆ బుడ్డోడికి అనిపించింది. టీవీలో చూశాడో..? లేక ఎవరైనా మాట్లాడుకునేప్పుడు విన్నాడో..? లేదా ఎవరైనా తనకు చెప్పారో..? మొత్తానికి పోలీసులే తన కుటుంబ సమస్యను పరిష్కారించగలరని భావించాడు.
ఇలా భరత్ ఆలోచిస్తున్న క్రమంలో.. గురువారం ఉదయమే బాలకిషన్ మళ్లీ తాగి ఇంటికి వచ్చాడు. ఇంకేముంది.. తాను ముందు నుంచి అనుకున్నట్టుగానే కిలోమీటర్ దూరంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు భరత్ నడుచుకుంటూ వెళ్లాడు. అక్కడ ఉన్న ఎస్సై వెంకటేశ్వర్లును కలిసి విషయం మొత్తం చెప్పాడు. ఆ బాలుడు ధైర్యంగా స్టేషన్‌కు వచ్చి.. నేరుగా తనకే ఈ విషయమంతా చెప్పటం చూసి ఎస్సై వెంకటేశ్వర్లు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.
స్టేషన్‌కు వెళ్లమని ఎవరు చెప్పారని చిన్నారిని ఎస్సై అడగ్గా.. తానే వచ్చానని పిల్లాడు సమాధానం ఇచ్చాడు. "పోలీసులు నీకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందా?" అని బాలుడిని ఎస్సై అడిగారు. దానికి.. "తప్పకుండా న్యాయం చేస్తారనే నమ్మకంతోనే వచ్చాను సార్" అని బదులిచ్చాడు. ఆ మాటల్లో చిన్నోడి తెగువ, బాధ్యత చూసి అబ్బురపోయిన ఎస్సై.. భరత్‌ను హత్తుకొని అభినందించారు. వెంటనే బాలుడి తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు రప్పించారు. బాలకిషన్‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని హెచ్చరించి ఇంటికి పంపించారు.