రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని పద్మానగర్ కాలువ వద్ద మురుగు నీటి శుద్ధి కేంద్రం పనులు పూర్తి కాకపోవడం వల్ల ఇళ్లలోకి పెద్దఎత్తున వరద, మురుగు నీరు వచ్చి చేరింది. ఆ ప్రాంతంలో పరిస్థితులు పరిశీలించేందుకు వచ్చిన మున్సిపల్ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పురపాలక సిబ్బంది తాత్కాలికంగా వరద నీటిని మళ్లించారు.
ఇందిరానగర్ నుంచి మొదలుకొని వివిధ వార్డుల గుండా మురుగు నీరు ప్రధాన కాలువ ద్వారా కొత్త చెరువులో కలుస్తుండేది. మురుగు నీటిని శుద్ది చేసి, చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా మార్చేందుకు అధికారులు ప్రణాళిక రచించారు.
ఆ దిశగా ప్రారంభమైన పనులు.. పూర్తికాకపోవడం వల్ల మురుగు నీరు వెళ్లే దారిలేక ఇళ్లలోకి చేరాయి. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి.. మురుగు నీటి శుద్ధి కేంద్ర నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.