ఒకప్పుడు సాగునీటి కోసం ఇబ్బందులు పడ్డ సిరిసిల్ల జిల్లా.. ప్రస్తుతం జల నిర్వహణ ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిందని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కరవు కోరల్లో నుంచి జలసిరులు వైపు, జిల్లా సాగించిన పయనంపై.. ఐఏఎస్ అధికారులకు జాతీయస్థాయిలో శిక్షణనిచ్చే ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్... సిరిసిల్ల మోడల్‌ను అధ్యయన అంశంగా ఎంచుకుందని మంత్రి ప్రకటించారు.
మోడల్ పాఠ్యాంశాలపై అధ్యయనం
శిక్షణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన వాటర్ మేనేజ్మెంట్ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు. ముఖ్యంగా జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, చిన్న తరహా సాగునీటి కార్యక్రమాల, భూగర్భజలాలు కలుషితం కాకుండా తీసుకున్న చర్యలు, వాటర్ కన్జర్వేషన్ పద్ధతుల వంటి బహుముఖ కార్యక్రమాల ద్వారా జిల్లాలో జరిగిన జల నిర్వహణ కార్యక్రమాలను మోడల్ పాఠ్యాంశాలుగా వీరు అధ్యయనం చేయనున్నారు.
నాలుగు జాతీయ స్థాయి అవార్డులు
జిల్లాకు గత ఐదేళ్లలో జాతీయ ఉపాధి హామీ పథకం, జల నిర్వహణ, స్వచ్ఛత కార్యక్రమాలతోపాటు ఇతర అనేక అంశాల్లో 2016, 2017, 2018, 2019లో జాతీయ అవార్డులు లభించాయి. జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిచిన ఈ కార్యక్రమాలను డాక్యుమెంట్ చేసి తమకు పంపాలని ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ కోరింది.
కేటీఆర్ హర్షం
సిరిసిల్ల మోడల్ జాతీయస్థాయిలో ఒక ఆదర్శవంతమైన ఉదాహరణగా ప్రశంసలు పొందడం పట్ల స్థానిక శాసనసభ్యులు, మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ పాలసీలు, విధానాలకు జాతీయస్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయని.. తర్వలోనే తెలంగాణ జల విధానం పైన అధ్యయనాలు జరుగుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా మోడల్‌ను ముస్సూరీ అకాడమీ అధ్యయనం చేస్తూ యువ ఐఏఎస్ అధికారులకు శిక్షణ ఇవ్వడం పట్ల ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇది గత ఆరేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం చేసిన కృషికి గుర్తింపుగా ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: యాసంగిలో వరి ధాన్యం సేకరణలో తెలంగాణ టాప్