కరోనా వైరస్ విజృంభన దృష్ట్యా ఈ ఏడాది గణనాథుని నిమజ్జన శోభాయాత్ర సాదాసీదాగా జరిగింది. ఎలాంటి ర్యాలీలకు పోలీస్ అధికారులు అనుమతి ఇవ్వకపోవడం వల్ల రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో గణేశుడి నిమజ్జనం నిరాడంబరంగా పూర్తైయ్యింది.
తొమ్మిది రోజుల పాటు గణేశుడికి ఘనంగా పూజలు నిర్వహించిన అనంతరం, మంగళవారం వినాయక ప్రతిమలను కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలపై ఊరేగింపుగా తీసుకువచ్చి మానేరు వాగులో నిమజ్జనం చేశారు. వాగులోకి ఎవరు వెళ్లకుండా కర్రలతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
పురపాలక సిబ్బందితో విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఓ బాలుడు తన ఇంట్లో ఏర్పాటు చేసిన వినాయకుడిని చిన్న బైక్ పై ఊరేగింపుగా మానేరు వాగు వద్ద నిమజ్జనానికి తీసుకెళ్తున్న తీరు పట్టణవాసులను చూపుతిప్పుకోకుండా చేసింది.
ఇవీచూడండి: వేలం పాట రద్దు.. ఈసారి బాలాపూర్ లడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే.