దక్షిణకాశిగా పేరొందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన మహాశివరాత్రి వేడుకల ఆదాయం గతంతో పోలిస్తే కొంత మేర తగ్గింది. మూడు రోజుల పాటు జాతరకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయంలోని వివిధ విభాగాల ద్వారా ఆదాయం సమకూరింది.
ఈ నెల 10 నుంచి 12 వరకు జరిగిన వేడుకల్లో దాదాపు మూడు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈనెల 10, 11 తేదీలలో కోడె మొక్కులు, ఆర్జిత సేవలు, ప్రసాదాలు, కేశఖండనం, శీఘ్రదర్శనం, అతి శీఘ్రదర్శనం, బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం, భీమేశ్వరాలయం, నగరేశ్వరాలయం, గదులు, ఇతర విభాగాల ద్వారా రూ.85లక్షల 55వేల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు . గతేడాది రూ.88లక్షల 59 సమకూరింది.
గతేడాది మహాశివరాత్రి వేడుకలతో పోల్చితే రూ. 3 లక్షలపైగా ఆదాయం తగ్గినట్లు తేలినా ఇంకా హుండీలను లెక్కించాల్సి ఉంది. ఈసారి వేడుకలకు వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనకు రూ.1.80 కోట్లు ఖర్చు చేశారు.
ఇటీవల మేడారంలో జరిగిన సమ్మక్క-సారక్క చిన్న జాతరకు ముందే వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. రాజన్నను దర్శించుకున్న తరవాతే మేడారం వెళ్లడం భక్తులకు ఆనవాయితీగా ఉంది. దీంతో చిన్నజాతర సందర్భంలోనూ భక్తుల తాకిడి పెరిగింది. హుండీలు భక్తుల కానుకలతో నిండిపోయి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరింది. ప్రతి సోమవారం 50వేల మంది పైగానే భక్తులు స్వామివారిని దర్శించుకునేవారు. మహాశివరాత్రి జాతరను తలపించేలా భక్తులు స్వామివారి దర్శనానికి అప్పుడే తరలి రావడం విశేషం. దీంతో మహాశివరాత్రికి భక్తుల రాక తగ్గి, ఆదాయం కూడా తగ్గిందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. మూడు నుంచి నాలుగు లక్షల వరకు భక్తులు వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేసింది. అయితే ఆ స్థాయిలో భక్తులు రాకపోవడం ఆదాయంపై ప్రభావం పడింది.
- ఇదీ చూడండి : ఆ గరళకంఠుడే ఈ నగరాన్ని నెలకొల్పాడటా...!