పోలీస్ ఉద్యోగం ఎంతో బాధ్యతాయుతమైనదని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. సాయుధ దళాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ వృత్తి నైపుణ్యాలను పెంచుకుంటూ.. క్రమశిక్షణతో పని చేసి పోలీస్‌శాఖ ప్రతిష్ఠను కాపాడాలని కోరారు. ఏఆర్ సిబ్బంది శాంతి భద్రతల పరిరక్షణ, బందోబస్తు విధుల్లో కీలక పాత్ర వహిస్తున్నారని చెప్పారు. జిల్లా ఏఆర్ పోలీసుల సమీకరణ కవాతు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనాన్ని స్వీకరించారు.
శాంతి భద్రతల పరిరక్షణ సమయంలో కోపం వచ్చినప్పటికి ఆవేశం ప్రదర్శించకుండా సంయమనంతో వ్యవహరించాలని రాహుల్ హెగ్డే సూచించారు. విచక్షణ కోల్పోకుండా ప్రజల హక్కులను కాపాడే బాధ్యత మనపైన ఉందనే విషయం గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు. పోలీసులు తమ వృత్తి నైపుణ్యాలను మర్చిపోకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ, శారీరక దారుఢ్యం సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. రోజులో కొంత సమయాన్ని వ్యాయామం, యోగా కోసం కేటాయించుకోవాలని తెలిపారు.
ఇదీ చదవండి: ప్రియాంక గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం