లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. గురువారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో లాక్డౌన్ అమలుతీరును ఆయన పరిశీలించారు. రాత్రిపూట నిబంధనలకు విరుద్దంగా బయటకు వచ్చిన పలు వాహనాలను సీజ్ చేశారు. 29 ద్విచక్రవాహనాలు, 12 కార్లను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. లాక్డౌన్ నిబంధనలను అందరు పాటించాలని ఎస్పీ అన్నారు. సాయంత్రం 7 గంటల వరకు తమకు కావాల్సిన నిత్యావసర సరకులను సమకూర్చుకోవాలన్నారు. సాయంత్రం 7 గంటల తర్వాత బయటకు రావద్దన్నారు.
ప్రజలంతా ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని అధికారులకు సహకరించాలన్నారు. జిల్లాలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు నిరంతర తనిఖీలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. అనుమానం వచ్చిన వ్యక్తులు, అనవసరంగా బయటకు వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ప్రజలంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, లేకుంటే వారికి రూ.1000 జరిమానా విధిస్తున్నట్లుగా తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి గ్రామాలకు, తమ ప్రాంతాలకు వ్యక్తులు వచ్చినట్లైతే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. స్వీయ నియంత్రణ పాటించాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు.
ఇవీ చూడండి: నిత్యావసరాలు పంపిణీ చేసిన సభాపతి