రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోలీస్ సిబ్బందికి ఎస్పీ రాహుల్ హెగ్డే ఆరోగ్య కిట్లు అందజేశారు. ఆరోగ్యంగా ఉన్న వారికి కరోనా సోకితే రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్న వారు తట్టుకొని నిలబడే పరిస్థితి ఉంటుందని ఎస్పీ తెలిపారు. షుగర్, బీపీ, మూత్రపిండాల సమస్యలు, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలున్న వారికి త్వరగా కరోనా సోకే అవకాశం ఉండటం వల్ల పోలీస్ సిబ్బంది అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అనారోగ్య సమస్యలున్న సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు అవకాశం ఇచ్చిన క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిరగవద్దన్నారు. 50 ఏళ్లు దాటిన వారు పూర్తి ఆరోగ్యంతో ఉంటేనే విధులకు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం తంగళపల్లి మండలంలోని తాడూర్ ఏఆర్ హెడ్ క్వాటర్స్‌లో ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్‌ను రాహుల్ హెగ్డే ప్రారంభించారు.