Rains in Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులన్నీ నిండుకుండల్లా మారాయి. రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాలోనూ మాత్రం వర్షం ఏకధాటిగా కురుస్తోంది. ఆయా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి సమీపంలో గోదావరి మధ్య కుర్రు ద్వీపంలో 9మంది కూలీలు చిక్కుకున్నారు. వ్యవసాయ పనుల కోసం నాలుగు రోజుల క్రితం వెళ్లిన తొమ్మిది మంది గోదావరి ఉద్ధృతి కారణంగా రాలేకపోతున్నారు.
సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ గుగులోతు రవి, ఆర్డీవో మాధురి, తహసీల్దారు దిలీప్ నాయక్ గోదావరి నదివద్దకు వెళ్లారు. అలాగే నది మధ్యలో చిక్కుకున్న వారితో ఫోన్లో మాట్లాడారు. నిజామాబాద్ నుంచి ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను రప్పించే యత్నం చేస్తున్నారు. మల్లాపూర్ మండలం వాల్గొండ, ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి వద్ద గోదావరి ఉధృతిని కలెక్టర్ రవితో పాటు ఎస్పీ సింధు శర్మ పరిశీలించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులో వరద నీరు వచ్చి చేరుతోంది. దిగువమానేరు జలాశయం సామర్థ్యం 24 టీఎంసీలుకాగా ప్రస్తుతం 9.76 టీఎంసీలకు నీరు చేరాయి. మధ్యమానేరు సామర్థ్యం 27టీఎంసీలు కాగా 9.48టీఎంసీలకు, ఎల్లంపల్లి సామర్థ్యం 20.18టీఎంసీ కాగా ప్రస్తుతం 13.24 టీఎంసీలకు నీళ్లు వచ్చి చేరాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ప్రస్తుతం 4 లక్షల 40వేల క్యూసెక్కులు వస్తుండగా 33 గేట్లు ఎత్తి 4లక్షల 15వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.
పునరావాస కేంద్రాలకు తరలించండి: శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారిని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మానేరు డ్యాంలో ముంపునకు గురైన నెదునూరు గ్రామంలోని గోసంగి కాలనీలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లను ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గత 5 రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోసంగి కులస్తుల ఇళ్లు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఎమ్మెల్యే, కలెక్టర్ వర్షంలోనే గొడుగులు పట్టుకొని కాలనీలోని ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఇబ్బందులను, పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో నివసించే వారిని వెంటనే ఖాళీ చేయించి, పాఠశాలల్లో, ప్రభుత్వ భవనాలకు తరలించి, వారికి తగు నివాసాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం శాశ్వత ఇళ్ల నిర్మాణం కోసం ఎమ్మెల్యే రసమయి, జిల్లా కలెక్టర్ స్థల పరిశీలన చేశారు.
కూలిపోతున్న ఇళ్లు: రాష్ట్రంలో రెండు, మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో పలుచోట్ల శిథిలావస్థలో ఉన్న ఇళ్లు కూలిపోతున్నాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి, ఇందిరానగర్ గ్రామాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల దాటికి పలు చోట్ల ఇండ్లు కూలిపోయాయి. మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల దాటికి తమ ఇళ్లు కూలిపోయాయని, తమకు ఎక్కడ ఉండే పరిస్థితి లేదని, ప్రభుత్వం తమను అదుకోవాలని ఇండ్లు కూలిపోయిన బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఇళ్లు కూలిపోయిన, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉన్న వారు ఉండడానికి స్థానిక పాఠశాల భవనాల్లో తాత్కాలిక వసతి కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని గ్రామాలలోని ప్రజలకు తెలియజేస్తున్నారు.
పార్వతి బ్యారేజ్‌కు వరద: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని పార్వతి బ్యారేజ్ నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. వరద ప్రవాహంతో పార్వతి బ్యారేజ్ నిండుకుండను తలపిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాజెక్టుల నుండి భారీగా నీరు విడుదల చేస్తుండడంతో పార్వతి బ్యారేజ్‌కు వరద పోటెత్తుతోంది. పార్వతి బ్యారేజ్ 74 గేట్లలో 58 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. పార్వతి బ్యారేజ్‌కు ప్రస్తుతం ఇన్ ఫ్లో 2,13,110 క్యూసెక్కుల ఉండగా.. అదే స్థాయిలో గోదావరిలోకి 2,13,110 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పార్వతి బ్యారేజ్ సామర్థ్యం 8.83 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.1290 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలతో పాటు గోదావరి ఒడ్డున ఉన్న పెద్దపల్లి జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లాలకు చెందిన గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వర్షంలో బోనాలు: రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని 33వ వార్డులో పోచమ్మ, మైసమ్మ తల్లి బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవార్లకు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్ పర్సన్ జిందం కళ హాజరయ్యారు. ప్రజలు అందరూ కలిసి సమాజ హితం కోరి ఎంతో కనుల పండగగా పోతురాజుల నృత్యాలతో వైభవంగా నిర్వహిస్తున్న పోచమ్మ, మైసమ్మ తల్లి బోనాల పండుగలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి చల్లని దీవెనలు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. పంటలు పండి వ్యాపారాలు లాభసాటిగా సాగాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు తెలిసేలా ఇలాంటి వేడుకలను నిర్వహించు కోవాల్సిన అవసరం మనపై ఎంతైనా ఉందన్నారు.
ఇవీ చదవండి:
నది మధ్యలో చిక్కుకున్న కూలీలు.. సీఎం ఆదేశంతో రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్
ఎస్సారెస్పీ 26 గేట్లు ఎత్తిన అధికారులు.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న జలసవ్వడులు