రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ కాల్వలకు అనుసంధానంగా ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలోని చెరువులంన్నిటిని నింపాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రంగనాయక సాగర్, మల్లన్నసాగర్‌కు సంబంధించిన నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఇప్పటికే కాళేశ్వరం జలాలు నియోజకవర్గానికి అందుతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి, ముస్తాబాద్ మండలాల్లోని చెరువులకు కాళేశ్వరం జలాలు వస్తాయన్నారు. మానేరు ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నింపాలని సాగునీటి శాఖ అధికారులకు సూచించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నడి ఎండాకాలంలో మానేరు ప్రాజెక్టు మత్తడి దుంకించే అవకాశం కాళేశ్వరం ప్రాజెక్టుతో కలుగుతుందన్నారు.
ప్రధాన కాల్వలతో చెరువులను నింపే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా... డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణ ప్రక్రియపైనా దృష్టి సారించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్‌కు ఫోన్లో ఆదేశించారు. కాల్వల నిర్మాణానికి సంబంధించి అవసరమైన భూసేకరణపైన స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: 'మరో ఆర్నెళ్లలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణం పూర్తి'