Minister KTR tour in Rajanna Sirisilla: అన్ని రంగాల్లో ప్రజల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా సర్కార్ పనిచేస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. నిత్యం కేసీఆర్‌పై విమర్శలు చేసేవారు దిల్లీ నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేములవాడలోని వీటీడీఏ, ఆర్ అండ్ బీ, పంచాయితీరాజ్ పనులకు సంబంధించిన పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కేజీబీవీని ప్రారంభించారు. రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్రం అభివృద్ధి సాధించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు నేతృత్వంలో వేములవాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రుద్రంగి సమగ్ర అభివృద్ధిలో ముందంజలో నిలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. పాత జూనియర్ కళాశాల భవనం స్థానంలో కొత్త జూనియర్ కళాశాల భవనాన్ని కట్టిస్తామని హామీ ఇచ్చారు. రూ.రెండు కోట్లతో రుద్రంగిలో రోడ్లు అభివృద్ధి చేసి.. వాటికి లైటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణలో విలీనం కావాలని కోరుతున్నారన్నారు.
2014కు ముందు 29 లక్షల మందికి పెన్షన్లు వచ్చేవి.. నవ తెలంగాణ వచ్చాక ఇప్పుడు 46 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని గర్వంగా చెప్పారు. దేశంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని కొనియాడారు. త్వరలో రైతు బంధు రూపంలో మరో రూ.7600 కోట్లును రైతుల ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తున్నామన్నారు. రద్రంగిలో ఫిబ్రవరిలో 30 పడకల ఆసుపత్రిని మంజూరూ చేస్తామని హామీ ఇచ్చారు.
రాజన్న సిరిసిల్లలో రూ.123 కోట్లును విద్యపై ఖర్చుపెట్టి.. పలు అభివృద్ధి పనులు చేస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలోని 26వేల ప్రభుత్వ పాఠశాలలను రూ.7300 కోట్లుతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 490 ప్రభుత్వ పాఠశాలల్లో 'మన ఊరు మన బడి' కార్యక్రమం కింద మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని మాట ఇచ్చారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు పరితపిస్తామని పేర్కొన్నారు.
"24 గంటలు రైతులకు కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.. ఇది వాస్తవం కాదా.. రైతులు భూమి శిస్తులు కట్టే స్థాయి నుంచి ఈరోజు రైతు బంధు రూపంలో రూ. 65వేల కోట్లు రైతుల ఖాతాల్లో పడతాయని ఏనాడైనా అనుకున్నామా? రూ.200 పెన్షన్.. రూ.2000 అవ్వడం చిన్న విషయమా చెప్పండి? దేశంలో ఎక్కడాలేని విధంగా బీడీ కార్మికురాలుకు పెన్షన్ ఇస్తున్నాము. రైతు ఏ కారణంతో చనిపోయిన పదిరోజుల లోపుల రూ.5 లక్షలను వారి కుటుంబానికి ఇచ్చి ఆదుకుంటున్నాము. ఉదయం లేవగానే కేసీఆర్ మీద తిట్ల దండకం మొదలు పెడుతారు. దిల్లీలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా ఏమైనా పనులు చేశారా?" - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
ఇవీ చదవండి: