కార్మిక, ధార్మిక, కర్షక ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయటమే కాకుండా... అన్ని హంగులతో అభివృద్ధి కావటానికి కారణమైన సీఎం కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సిరిసిల్లలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాల అనంతరం సమావేశంలో పాల్గొన్నారు.
కార్మికులకు ప్రోత్సాహం..
గత ఏడేళ్లుగా జిల్లాలో ఎన్నో అద్భుతాలు సాధించామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న వివిధ రకాల కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్... అన్ని విధాల ప్రోత్సాహం అందించారని తెలిపారు. బీడీ కార్మికులకు పింఛన్, చేనేత కార్మికులు వేతనాల పెంపు లాంటి కార్యక్రమాలతో వారి జీవితాల్లో చీకటిని పారద్రోలారని కొనియాడారు. బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫాంల ఆర్డర్లతో ప్రభుత్వం పరంగా చేయూతగా నిలిచారని తెలిపారు. ధార్మిక క్షేత్రంగా... దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడను అభివృద్ధి చేసేందుకు 35 ఎకరాల స్థలాన్ని ఇచ్చారని గుర్తుచేశారు. రాజన్నపై ప్రత్యేక శ్రద్ధతో దేవాలయ అభివృద్ధి చేయాలని సీఎంను కేటీఆర్ కోరారు.
నిండుకుండలైన చెరువులు...
"బీడువడ్డ భూములన్ని పంటలతో కళకళలాడుతున్నాయంటే దానికి కారణం కేవలం సీఎం కేసీఆరే. ఎక్కడో గోదావరి నది ఉండేదని చిన్నప్పుడు వినటమే కానీ... చూసింది లేదు. అలాంటి గోదారిని... కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తీసుకొచ్చి మన పొలాల సాగుకు నీరందిస్తున్న కృషీవలుడు కేసీఆర్. మిషన్ కాకతీయతో గ్రామలన్ని నిండు చెరువులతో ఉండటానికి కారణం కూడా సీఎం ముందుచూపే. మిషన్ కాకతీయ వల్ల జిల్లాలో భూగర్భ జలాలు ఆరు మీటర్లు పైకి వచ్చాయి. ఈ విషయం యువ ఐఎఎస్‌లకు పాఠ్య పుస్తకాల్లో చేర్చారు".
- కేటీఆర్
మెడికల్ కాలేజీ విజ్ఞప్తి...
జిల్లాలో మరో 12 చెక్ డ్యాంలు నిర్మించుకోవాల్సి ఉందని మంత్రి తెలిపారు. ఎగువ మానేరు కాల్వలు ఆధునీకరించుకోవల్సి ఉందన్నారు. ఎప్పుడో 75 ఏళ్ల క్రితం నిర్మించిన మానేరు జలాశయాలను పకడ్బందీగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అద్భుత ప్రకృతి సౌందర్యంతో.. ఆహ్లాదమైన వాతావరణంతో.. మహాసంద్రాన్ని తలపించే జలాశయాలైన... మధ్య మానేరు, ఎగువ మానేరు, అనంతగిరి ప్రాంతాలను టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌కు రెండు గంటల దూరంలోనే ఉన్న ఈ మూడు ప్రాంతాలను పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరారు. సిరిసిల్ల జిల్లాలకు ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు కూడా మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
సిరిసిల్ల జిల్లా అభివృద్ధితో విలసిల్లేందుకు కారణమైన సీఎం కేసీఆర్‌కు... జిల్లావాసుల తరఫున మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.