అడవులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్ శివారులో అర్భన్ ఫారెస్ట్ పార్కుకు శంకుస్థాపన చేసిన కేటీఆర్... నిర్లక్ష్యానికి గురైన అడవులను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. పట్టణాలకు 5-7 కి.మీ దూరంలో అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారని చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లో అర్బన్ ఫారెస్ట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారన్నారు.
ప్రాజెక్టుల కోసం అటవీ భూములు తీసుకుంటే బదులుగా చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల జిల్లాలో తీసుకున్న అటవీ భూములకు బదులుగా మొక్కలు నాటుతున్నట్లు వివరించారు. జిల్లాలో 1400 హెక్టార్లలో మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం 24 శాతంగా ఉందని.. సిరిసిల్ల జిల్లాలో అటవీ విస్తీర్ణం 19.85 శాతంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం 33 శాతానికి తీసుకెళ్లే దిశగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లాలో ఒక్క రోజే 1.15 లక్షల మొక్కలు నాటామని... మానేరు తీరంలో 50 వేల మొక్కలు నాటినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:వారికి స్మార్ట్ఫోన్లే లేవ్- మరి ఆన్లైన్లో చదువెలా?