రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. నర్మాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికులతో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రైతుల జీవితాలు మెరుగవుతున్నాయని తెలిపారు. రైతు బంధు ఇచ్చి అన్నదాతలను ఆదుకుంటున్నామని... ఏ కారణంతో వారు మరణించినా... రూ.5 లక్షల బీమా ఇచ్చి.. అన్నదాత కుటుంబానికి అండగా నిలుస్తున్నామని గుర్తు చేశారు.
గతంలో గోదాముల సామర్థ్యం 4 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండేదని.. ఇప్పుడు 25 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచామని వెల్లడించారు. తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా మారిందన్నారు. రాష్ట్రంలో హరిత, నీలి, గులాబీ, శ్వేత విప్లవాలు ఆవిష్కృతమవుతున్నాయని.. ఈ విప్లవాలతో గ్రామీణ ఆర్థిక జీవనంలో మార్పు వచ్చిందని తెలిపారు.
చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అభివృద్ధి కోరుకున్నప్పుడు కొంత త్యాగం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పరిశ్రమలు ఇక్కడికి రావాలంటే పారిశ్రామికవేత్తలను ఒప్పించాలి.. మెప్పించాలన్నారు. ఫుడ్ పార్క్ యూనిట్ మొదటి అడుగు మాత్రమమేనని అన్నారు. పార్కుకు ఏర్పాటుకు 260 ఎకరాలు కేటాయించామని తెలిపారు. ఇదే కాక మరో 4 పరిశ్రమలు రాబోతున్నాయని వెల్లడించారు. కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో అద్భుతమైన మార్పు వచ్చిందని... గత ప్రభుత్వాల హయాంలో నర్మాల, దేశాయిపేటలో ఎవరైనా చనిపోతే కరెంట్ కోసం బతిమిలాడుకునే పరిస్థితి ఉండేదన్నారు. నేడు 24 గంటలు కరెంట్ సరఫరా జరుగుతోంది.
ఇదీ చదవండి: కేటీఆర్ సొంత నిధులతో గంభీరావుపేట రైతు వేదిక నిర్మాణం