వరిధాన్యం కొనుగోలు విషయం(TRS Dharna over Paddy procurement)లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోటాపోటీ ధర్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే వరి కొనుగోలు చేయాలంటూ గురవారం భాజపా ఆందోళన చేపట్టగా.. నేడు అధికార పార్టీ రోడ్డెక్కింది. ముఖ్యమంత్రి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా తెరాస శ్రేణులు ధర్నాకు దిగాయి. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు... ఇతర నేతలతో కలిసి ధర్నా చేపట్టారు. సిరిసిల్లలోని తెరాస ధర్నాలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ.. తెరాస శ్రేణులతో కలిసి ఆయన ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఇప్పటి నుంచి తెరాస అంటే.. తెలంగాణ రైతు సమితి అని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతుల ఉత్సాహం చూస్తుంటే మరోసారి తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తోందని మంత్రి వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరోసారి రైతులంతా ఉద్యమించాలని సూచించారు. రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలన్నారు.
'' కేసీఆర్ నాయకత్వంలో ఏడున్నరేళ్ల క్రితం మన పాలన ప్రారంభమైంది. తెలంగాణ ఏర్పడక ముందు రైతుల దుస్థితి ఏందో ఆలోచించాలి. విద్యుత్, విత్తనాలు, ఎరువుల కోసం ధర్నాలు చేసే దుస్థితి ఉండేది. కాంగ్రెస్ హయాంలో కనీసం ఐదారు గంటలు కూడా విద్యుత్ వచ్చేది కాదు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు వేసినా నీళ్లు రాక అప్పుల పాలయ్యారు. గతంలో చెరువులు, కుంటలను పట్టించుకోలేదు. ఉమ్మడి ఏపీలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువని పార్లమెంట్‌లోనే చెప్పారు. నిరంతర విద్యుత్ సరఫరా తీసుకొచ్చిన ఏకైక సీఎం మన కేసీఆర్. రైతులకు మంచి జరగాలనే సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే.
ఒక్క ఏడాదిలో సాధించాం..
గతంలో ఒకాయన సీఎంగా ఉన్నప్పుడు ఏడేళ్లు కరవే ఉంది. కేసీఆర్ సీఎం అయ్యాక ఏడేళ్లలో ఎప్పుడైనా కరవు వచ్చిందా..? ఏడు దశాబ్దాల్లో లేని 24 గంటల విద్యుత్ కేసీఆర్ ఒక్క ఏడాదిలో సాధించారు. ఏడున్నరేళ్లలో కేసీఆర్ రైతులకు, వ్యవసాయానికి పెద్దపీట వేశారు. 11 రాష్ట్రాలు సహా కేంద్ర ప్రభుత్వం కూడా మన పథకాలను కాపీ కొట్టారు. రైతులకు బీమా అందిస్తోన్న ఏకైక ప్రభుత్వం తెరాసదే. ఏ రాష్ట్రంలో, ఏ ప్రభుత్వం అమలు చేయని పథకాలు తీసుకొచ్చాం. కృష్ణా, గోదావరి నీళ్ల కోసం ఎన్నో పోరాటాలు చేశాం. ప్రాజెక్టులకు పెద్దపీట వేసి బీడు భూములకు నీరు అందించాం. మానేరులో మత్తడి దూకుతుందని ఎప్పుడైనా అనుకున్నామా? కాళేశ్వరం చిన్నాచితక ప్రాజెక్టు కాదు.. ప్రపంచంలోనే అతిపెద్దదైన బహుళ ఎత్తిపోతల ప్రాజెక్టు. గోదావరి జలాలు సిరిసిల్ల సహా తెలంగాణ బీడు భూములకు సైతం అందుతున్నాయి.
ఒకటి, రెండు కాదు లక్షల ఎకరాలకు కొత్తగా నీరిచ్చాం. ఏడేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయంలో అద్భుతమైన రికార్డులు నమోదు చేశాం. 3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని తెలంగాణ రైతులు పండిస్తున్నారు. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ.. పంజాబ్‌ను దాటిపోయింది. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. దిక్కుమాలిన కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయి. అన్ని అమ్మాలి.. వడ్లు కొనవద్దన్నదే భాజపా విధానం. కేంద్రం అన్నింటినీ అమ్ముతోంది.. వడ్లను మాత్రం కొనట్లేదు.''
-మంత్రి కేటీఆర్
ధాన్యం సేకరణ బాధ్యత కేంద్రానిదే
దేశంలో సాగుకు యోగ్యంగా 40 కోట్ల భూములు అందుబాటులో ఉన్నాయని.. 65 వేల టీఎంసీలు నీరు అందుబాటులో ఉందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇన్ని వసతులు ఉన్నా వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆకలి సూచీలో 116 దేశాల్లో భారత్ ర్యాంకు 102 రావడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. నేపాల్, బంగ్లా, భూటన్ కంటే కూడా భారత్ పరిస్థితి దిగజారిపోయిందని... దిక్కుమాలిన దివాలాకోరు విధానాలు, చేతకాని పాలనతో తల దించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.
''కేంద్రంలోని నేతలకు సిగ్గనిపించడం లేదా? ఆకలి రాజ్యాల జాబితాలో భారత్‌ది 101వ ర్యాంకు. భాజపా, కాంగ్రెస్ దిక్కుమాలిన పాలన వల్లే 101వ ర్యాంకులో ఉంది. తెలంగాణ సాధించిన అభివృద్ధి దేశంలో చేయడానికి చేతకాలేదు కానీ.. ఇప్పుడు రాష్ట్రంపై విమర్శలు చేస్తున్నారు. ధాన్యం సేకరణ బాధ్యత కేంద్రానిదే. రాజ్యాంగంలో దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించాలనే ధాన్యం సేకరణ బాధ్యతను కేంద్రంపై పెట్టారు. దేశంలో ఉండే పేదలకు తిండి పెడుతూ.. అవసరమైతే విదేశాలకు ఎగుమతి చేయాలి.''
-మంత్రి కేటీఆర్
చేతనైతే మోదీ, పీయూష్ గోయల్ మెడలు వంచండి..
రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి ఎఫ్‌సీఐ ద్వారా కేంద్రానికి ఇస్తుందని మంత్రి తెలిపారు. దాదాపు ఆరేళ్లు బాగానే నడిచింది.. కానీ ఇప్పుడు కేంద్రం ధాన్యం కొనలేమని చేతులెత్తిసిందన్నారు. ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగిందని... వానాకాలంలోనే 62 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారని వెల్లడించారు. వానాకాలం పంటలకు బాధలేదని... యాసంగి పంట దగ్గరే పంచాయితీ వచ్చిందని తెలిపారు. యాసంగిలో ఉప్పుడు బియ్యమే ఇస్తాం... రా రైస్ ఇవ్వలేమని ముందే కేంద్రానికి చెప్పామన్నారు. మనం జైకిసాన్ అంటే భాజపా వాళ్లు నై కిసాన్ అంటున్నారని వ్యాఖ్యానించారు.
బియ్యం కొని విదేశాలకు ఎగుమతి చేసే అధికారం రాష్ట్రాలకు లేదు. కేంద్రమే ధాన్యం కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేయాల్సి ఉంటుంది. ఏ దేశాల్లో అవసరం ఉందో అక్కడికి ఎగుమతి చేయాలని కేంద్రానికి చెప్పాం. యాసంగిలో వరి వద్దే వద్దని కేంద్రం మొండికేసింది. అందుకే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని మేం రైతులకు అవగాహన కల్పించాం. యాసంగిలో మేం వరి వద్దని చెప్పిన గంటల్లోపే బండి సంజయ్ వరి వేయమని చెబుతారు. వరి వద్దని కేంద్రం అంటుంది.. బండి సంజయ్ వేయమంటారు. ఇదేం కథనో అర్థం కాదు. యాసంగిలో వడ్లు కొంటామని మోదీ చెబితే మేం వద్దంటామా? 4 ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ధాన్యం కొనకపోతే మెడలు వంచుతామని బండి సంజయ్ అంటున్నారు. ఇంతకీ ఆయన ఎవరి మెడలు వంచుతారు? చేతనైతే మోదీ, పీయూష్ గోయల్ మెడలు వంచండి.
-కేటీఆర్, మంత్రి
లొల్లి ఎందుకులే అని ఆగినాం అంతే..
యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసేలా ఇప్పటికే కొన్ని గ్రామాలు ముందుకొచ్చాయని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నామని... భాజపా మాత్రం ఓట్ల రాజకీయం కోసం మా ప్రయత్నాన్ని అడ్డుకుంటోందని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి కుమారుడే వాహనంతో 8 మంది రైతులను చంపేస్తే ఏమీ చర్యలు తీసుకోలేదని... రైతులకు అన్యాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం భాజపానే అని ఆరోపించారు. తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఐదేళ్లుగా అడుగుతున్నా ఇవ్వలేదు కానీ.. కర్ణాటకలో అప్పర్ భద్ర, ఏపీలో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు సాధించలేకపోయారో భాజపా రాష్ట్ర నేతలు చెప్పాలి అంటూ ప్రశ్నించారు. ఎందుకు పంచాయితీ అని ఏడేళ్లుగా ఓపిక పట్టామని.. కొత్త రాష్ట్రం కదా గొడవలు ఎందుకని సహనంతో ఉన్నామని స్పష్టంచేశారు. ఇప్పట్నుంచి కేంద్రాన్ని అడుగడుగునా అడ్డుకుంటామని.. ఫలితం వచ్చేంత వరకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: TRS Dharna over Paddy procurement :' రైతును కష్టపెట్టిన ఏ సర్కార్ నిలబడలే'