ఆరుగాలం పండించిన పంటను అమ్మడానికి పడుతున్న కష్టాల్ని మంత్రి కేటీఆర్‌కు ఏకరువు పెడుతూ ఆత్మహత్యాయత్నం చేసిన ఓ రైతు వీడియో వైరల్‌గా మారింది. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగాల పల్లి గ్రామానికి చెందిన మహిపాల్ రెడ్డి అనే రైతు ఈనెల 4న సెల్ఫీ తీసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.
తాను పండించిన ధాన్యాన్ని మిల్లర్లు కొర్రీలు పెడుతూ కొనుగోలుకు నిరాకరించారని, దీంతో తన కుటుంబం వీధిన పడే దుస్థితి నెలకొందని, ఇక తనకు చావు తప్ప మరో మార్గం లేదని ఆ వీడియోలో పేర్కొన్నాడు. మంత్రి కేటీఆర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయమై ఒక రైతు కలత చెంది ఆత్మహత్యయత్నానికి పాలడటంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండి పడుతున్నాయి. ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతున్న రైతును భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పలువురు నాయకులు పరామర్శించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది.
ఇదీ చూడండి: నిధుల సమీకరణపై టాటా గ్రూప్ కీలక ప్రకటన