రాజన్న సిరిసిల్ల జిల్లా అనంతగిరి రిజర్వాయర్ భూనిర్వాసితుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో సదుపాయాలను పరిశీలించాలని జూనియర్ సివిల్ జడ్జిని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. జిల్లా కలెక్టర్, భూసేకరణ అధికారి, పిటిషనర్ల న్యాయవాదితో కలిసి పరిశీలించాలని పేర్కొంది. అనంతరం పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని తెలిపింది. ప్రాజెక్టు నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు అప్పగించడం లేదని దాఖలైన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అనంతగిరి రిజర్వాయర్ కోసం తమ భూములను సేకరించిన ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ ఇళ్ల స్థలాలు అప్పగించడం లేదంటూ ఇల్లంతకుంట మండలం అనంతగిరికి చెందిన 58 మంది నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. పునరావాస కాలనీల్లో సరైన సదుపాయాలు కల్పించడం బాధితులకు అప్పగించడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
మరోవైపు నిర్వాసితుల కోసం 70 కోట్ల రూపాయలతో భూమిని అభివృద్ధి చేసి ప్లాట్లు చేసినట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ వివరించారు. తాత్కాలికంగా రెండు పడక గదుల ఇళ్లు కూడా ఇచ్చినట్లు తెలిపారు. అభివృద్ధి చేసిన ప్లాట్లను తీసుకోవాలని కోరుతూ ఏప్రిల్లోనే నోటీసులు ఇచ్చినప్పటికీ.. నిర్వాసితులు ముందుకు రావడం లేదన్నారు. వసతులు సరిగా లేవంటూ నోటీసులు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. ఇరువైపుల భిన్న వాదనల నేపథ్యంలో వాస్తవాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని సిరిసిల్ల జూనియర్ సివిల్ జడ్జి, కలెక్టర్లను ధర్మాసనం ఆదేశిస్తూ.. తదుపరి విచారణ ఆగస్టు రెండో వారానికి వాయిదా వేసింది.