సిరిసిల్లలో ఇవాళ్టి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెరాస అధినేత రాకను పురస్కరించుకుని పట్టణమంతా గులాబీమయంగా మారింది. అడుగడుగునా స్వాగత తోరణాలతో సరికొత్త శోభను సంతరించుకుంది. కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో తొలిసారి నిరుపేదల సొంతింటి కల నెరవేరబోతోంది. ప్రభుత్వం ఉచితంగా అందించనున్న రెండు పడక గదుల ఇళ్లను గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నాణ్యతలో రాజీపడకుండా నిర్మించారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద దాదాపు 30ఎకరాల స్థలంలో 83కోట్లతో తీర్చిదిద్దారు. నవతేజ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ అద్వితీయంగా నిర్మించిన 1320 డబుల్ బెడ్‌రూం ఇళ్లను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించనున్నారు. జీప్లస్‌టుగా నిర్మించిన ఒక్కో యూనిట్ ఇంటికి సకల హంగుల కోసం ఆరు కోట్లకుపైగా వెచ్చించారు. గృహ సముదాయానికి ప్రహరిగోడ, రహదారి డివైడర్, ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి 8కోట్లు ఖర్చు చేశారు. పారిశుద్ధ్యం,మౌలికవసతులతో పాటు ఇంటింటికి మిషన్ భగీరథ జలం అందించే ఏర్పాట్లు చేశారు.
20ఎకరాల్లో అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్
రాష్ట్రంలోనే తొలిసారి సిరిసిల్లలో అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకున్న అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్‌ను సీఎం ప్రారంభిస్తారు. దాదాపు 20ఎకరాల్లో 21కోట్ల 48 లక్షలతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించాయి.180మందికి వసతితో కూడిన శిక్షణ తీసుకొనే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. ఐదెకరాల్లో 27 కోట్ల వ్యయంతో నిర్మించిన నర్సింగ్ కళాశాలను సీఎం అందుబాటులోకి తేనున్నారు.105గదులు ఐదు ప్రయోగశాలలు, 400మంది విద్యార్థులకు సరిపోయేలా అనుబంధంగా వసతిగృహాన్ని నిర్మించారు.
98ఎకరాల్లో కలెక్టరేట్
పాలనా సౌలభ్యం కోసం రగుడు గ్రామం వద్ద దాదాపు 98ఎకరాల్లో 70 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. రెండతస్తులు నాలుగు బ్లాకుల్లో అన్ని ప్రభుత్వ విభాగాలకు ఒకే గొడుగు కింద పనిచేసేలా సకల వసతులతో అందుబాటులోకి రానుంది. రాష్ట్రానికే తలమానికంగా సర్దాపూర్‌లో 20ఎకరాల్లో 22కోట్ల రూపాయలతో ఆధునిక వ్యవసాయ మార్కెట్ ప్రజలకు సేవలందించనుంది. సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం తర్వాత ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం రోడ్డు మార్గాన హైదరాబాద్ బయలుదేరి వెళతారు.
ఇదీ చదవండి: 'పోతిరెడ్డిపాడును అంగీకరించం.. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ అక్రమ ప్రాజెక్టే'