రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన పాఠ్యపుస్తకాలను డీఈఓ రాధాకిషన్ బుధవారం పంపిణీ చేశారు. కరోనా నిబంధనలను పాటిస్తూ రోజుకు కొన్ని పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలు పాఠశాలల్లో ఉండటం కంటే విద్యార్థులకు ఇచ్చినట్లయితే మేలు జరుగుతుందన్నారు. ఇంటిదగ్గర పాఠాలు చదువుతూ కొంతమేరకు వారు సిలబస్ పూర్తి చేసిన వారవుతారని ఉద్దేశించి విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో యాదగిరి, మన టీవీ ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తున్నామన్నారు. టీవీలో పాఠాలు వింటూ పుస్తకాలు చదివినట్లయితే విద్యార్థులకు తొందరగా అర్థమవుతుందని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలు ప్రారంభం అయ్యే వరకు విద్యార్థులు ఇంటి వద్దనే ఉంటూ పాఠ్యపుస్తకాలను చదువుకోవాలి సూచించారు. జిల్లాలో మొత్తం 40వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారని.. వారందరికీ కూడా పాఠ్యపుస్తకాలను అందించడం జరుగుతుందన్నారు.
ఇదీ చూడండి: ఇంకెంత కాలం ఇంట్లో ఉండాలని పేచీ పెడుతున్నాడు?