Bandi Sanjay wrote a letter to CM KCR: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేసే జీవోను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పంచాయతీ కార్యదర్శలు నిరవదిక నిరసన చేపట్టారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శులు చేస్తున్న ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొని సంఘీభావం తెలిపారు.
సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ: జూనియర్ పంచాయితీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె న్యాయ బద్దమైనదేనని బండి సంజయ్ అన్నారు. వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు జూనియర్ కార్యదర్శుల సమక్షంలో బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. వారు చేస్తున్న డిమాండ్ సమంజసమైనదేనని... పోటీ పరీక్షలు పాసై అన్ని అర్హతలు సాధించిన వారిని ప్రొబేషనరీ పిరియడ్ పూర్తయి నాలుగేళ్లయినా రెగ్యులరైజ్ చేయకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రొబేషనరీ పీరియడ్ మరో సంవత్సరం పెంచుతున్నట్లు ప్రకటిస్తే ఆ తర్వాత పర్మినెంట్ చేయాలి కదా అని ప్రశ్నించారు.
కేసీఆర్ సీఎం అయ్యాక ఓట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉండరని, అందరినీ పర్మినెంట్ చేస్తామని నిండు అసెంబ్లీలో చెప్పి మాట తప్పారన్నారు.
రోడ్లు ఎక్కి తప్ప మీ సమస్య పరిష్కారం అవ్వదు: కేసీఆర్ సీఎం అయ్యాక ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉండరని, అందరినీ పర్మినెంట్ చేస్తామని అసెంబ్లీ సమావేశాల్లో చెప్పిన మాట తప్పారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఉద్యోగులారా... భయపడి ఇంట్లో కూర్చుంటే మీ సమస్యలు పరిష్కారం కావు... రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తేనే మీ సమస్యలు పరిష్కారమవుతాయని ఉద్యోగులనుద్దేశించి అన్నారు. ఏ లక్ష్యంతో తెలంగాణ తెచ్చుకున్నారో అది నెరవేరాలంటే రోడ్లెక్కాల్సిందేనని స్పష్టం చేశారు.
జూనియర్ పంచాయితీ కార్యదర్శులకు మేము ఉన్నాం: తమతోటి ఉన్న సహ ఉద్యోగులను సస్పెండ్ చేస్తే భయపడవద్దని.. వారి తరఫున బీజేపీ పోరాడుతుందని తెలిపారు. ఉద్యోగుల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధమని... కార్యదర్శులను బెదిరిస్తే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరిని పర్మినెంట్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ వారికి అండగా ఉంటుందని.. మరో ఆరు నెలలో తమ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన అనంతరం వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఉత్తమ గ్రామ పంచాయితీ అవార్డులు మా కష్టంతోనే వచ్చాయి: నిర్మల్ జిల్లాలో వినూత్నంగా బతుకమ్మ ఆడి పంచాయతీ కార్యదర్శులు నిరసన తెలిపారు. నల్గొండ జిల్లాలో వంటా వార్పు కార్యక్రమం ద్వారా వారి సమస్యను వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శుల కష్టంతోనే రాష్ట్రానికి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు వచ్చాయన్న విషయాన్ని గుర్తు చేశారు.
ఇవీ చదవండి: