Bandi Sanjay Comments On KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలే రాష్ట్రంలో పోడు భూముల సమస్యలకు ప్రధాన కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సమస్య పరిష్కరిస్తామని గతంలో ఎన్నోసార్లు కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయినా సీఎం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోడుదారుల మీదకు అటవీ అధికారులను ప్రభుత్వమే ఎగదోస్తోందని దుయ్యబట్టారు. రాజన్న సిరిసల్ల జిల్లా వేములవాడలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మల్లారెడ్డి ఏ తప్పు చేయనప్పుడు ఐటీ దాడులంటే ఎందుకు భయపడుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. ఫిర్యాదుల ఆధారంగానే ఐటీ అధికారులు వారి పని వారు చేస్తుంటారని చెప్పారు. కానీ అధికారులపై మల్లారెడ్డి దుర్భాషలాడడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏది జరిగినా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడం సరికాదని అన్నారు. సీఎం కేసీఆర్ తన కుటుంబ సభ్యుల అక్రమ సంపాదన బండారం బయటపడకుండా ఉండేందుకే ఈ కుట్రలు పన్నుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
"పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని వారికి పట్టాలు ఇస్తానని హుజురానగర్, నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో సీఎం చెప్పారు. ఎక్కడ ఉపఎన్నికలు జరిగినా ఇదే మాట చెబుతారు. ఇంత వరకూ సమస్య పరిష్కరించారా. ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు హత్యకు సీఎం బాధ్యత వహించాలి. మీరు సమస్య పరిష్కరించకపోవడంతో ఫారెస్ట్ అధికారులు, ప్రజలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది." - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి: తప్పు చేయకుంటే ఐటీ దాడులపై భయమెందుకు?: లక్ష్మణ్
ఐటీ, ఈడీ, సీబీఐ.. దేన్నైనా ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ రెడీ : మల్లారెడ్డి