రాజన్న సిరిసిల్ల జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. కుండపోతగా కురిసిన వర్షాలతో సిరిసిల్ల పట్టణం జలమయమైంది. చెరువులు నిండి.. వాగులు పొంగి.. పట్టణంలోని పలు కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయకచర్యలు చేపట్టాయి. ఇప్పుడిప్పుడే వరద నీరు తీసేస్తుండడంతో నగరం తేరుకుంటోంది.
కుప్పలు తెప్పలుగా చెత్త
జలదిగ్బంధం నుంచి తేరుకుంటున్న సిరిసిల్లకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. బుధవారం నాటికి వెంకంపేట, పాత బస్టాండ్, అంబిక నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. పట్టణంలోని శాంతినగర్ మినహా మిగిలిన ప్రాంతాల్లో వరద తగ్గింది. కానీ రోడ్లన్నీ బురదగా మారాయి. కాలనీలు, ప్రధాన కూడళ్ల వద్ద చెత్త కుప్పలుతెప్పలుగా పేరుకుపోయింది. పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. రోడ్లపై ఇసుక మేటలతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఇదీ చూడండి: RAINS IN TELANGANA: రాష్ట్రంలో వరుణ ప్రతాపం.. వరద నీటితో ప్రజల పాట్లు
పలు చోట్ల కొనసాగుతున్న వరద
సిరిసిల్ల కొత్తచెరువు వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తచెరువు దిగువన ఉన్న శాంతినగర్, రాజీవ్ నగర్ తదితర ప్రాంతాల్లో చాలా ఇళ్లు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సిరిసిల్లలో 216 కుటుంబాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పునరావాస కేంద్రానికి తరలించాయి. సిరిసిల్ల-కరీంనగర్ ప్రధాన రహదారిపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వరద వల్ల ఈ మార్గంలో రవాణాకు అంతరాయం ఏర్పడింది.
గల్లంతైన కార్మికుడి మృతదేహం లభ్యం
సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్యనగర్కు చెందిన భవన నిర్మాణ మేస్త్రీ పెరుమాండ్ల దేవయ్య(55) మ్యాన్హోల్లో పడి గల్లంతయ్యాడు. వర్షాల కారణంగా మంగళవారం ఇంట్లోనే ఉన్న దేవయ్య... సాయంత్రం వర్షం తగ్గడంతో కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్ బయలుదేరాడు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న మ్యాన్హోల్లో పడిపోయాడు. గాలింపు చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు... దేవయ్య మృతదేహాన్ని ఇవాళ ఉదయం నాలా నుంచి 50మీటర్ల దూరంలో కనుగొన్నారు. మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
నైరుతి ముంచేసింది..
నైరుతి రుతుపవనాల ప్రభావంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Rain Effect in Sircilla) ఎడతెరిపిలేని వర్షాలు కురిశాయి. జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు అలుగుపారుతున్నాయి. భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నీటి మునిగింది. ఎడతెరిపిలేని వర్షం పట్టణాన్ని ముంచెత్తింది. వరద నీటితో చాలా కాలనీలు జలమయమయ్యాయి. ప్రగతినగర్, సాయినగర్... అంబికానగర్, శాంతినగర్, గాంధీనగర్‌లో ఇళ్లలోకి వరద నీరు చేరింది.
ఆదుకున్న డీఆర్ఎఫ్ బృందాలు
సహాయక చర్యల కోసం హైదరాబాద్ నుంచి డీఆర్ఎఫ్ బృందాన్ని మంత్రి కేటీఆర్ పంపించారు. కేటీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు రెండు డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. వరద సహాయక చర్యల్లో చాలామందిని ముంపు నుంచి ఒడ్డున పడేశాయి.
ఇదీ చూడండి: Rain Effect in Sircilla : సిరిసిల్లను ముంచెత్తిన వరద... జిల్లాకు డీఆర్‌ఎఫ్ బృందాలు