పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాశయంలో గతేడాది మాదిరిగానే ఈ వేసవి కాలంలో కూడా నీటి నిల్వ తగ్గింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 13 వరకు నంది పంపుహౌస్ ద్వారా శ్రీ రాజరాజేశ్వర (మిడ్ మానేరు) జలాశయానికి ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలు చేపట్టారు. అనంతరం జలాశయంలో నీటిమట్టం తగ్గుతూ వచ్చింది. ఎల్లంపల్లి జలాశయం డెడ్ స్టోరేజీ 134 మీటర్లు. శనివారం సాయంత్రం ప్రాజెక్టులో 20 టీఎంసీలకుగానూ 7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటిమట్టం 148 మీటర్లకుగానూ 141.69 మీటర్లకు చేరింది. కాగా.. పది రోజుల క్రితం ప్రాజెక్టులో నీటి నిల్వ 5.5 టీఎంసీలకు తగ్గింది. ఒక దశలో తాగునీటి ఎత్తిపోతలకు ఇబ్బంది ఏర్పడింది. వెంటనే సమీప గోయల్ వాడలోని కాళేశ్వరం ప్రాజెక్టు పార్వతీ పంపుహౌస్ నుంచి 1.5 టీఎంసీల నీటిని ఎల్లంపల్లిలోకి ఎత్తిపోశారు.
ఎన్టీపీసీ కేంద్రాలకు సరఫరా..
శుక్రవారం వరకు ప్రతిరోజూ ఒక పంపుమోటార్‌ను 3 నుంచి 5 గంటలపాటు నడిపారు. దీంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రో వాటర్ పనులకు తాగునీరు, ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్రి కేంద్రాలకు ఎల్లంపల్లి నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మి, సరస్వతీ, పార్వతీ బ్యారేజ్‌ల వద్ద తగిన నీటిమట్టం ఉండటం వల్ల పంపుహౌస్‌ల ద్వారా అవసరమైనపుడు నీటిని ఎగువకు ఎత్తి పోస్తున్నారు. ప్రస్తుతం గోయల్వాడలోని పార్వతీ పంపుహౌస్ వద్ద 3.92టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా.. జూన్ చివరి నాటికి తాగునీటి పథకాలు, ఎన్టీపీసీకి సరఫరా చేసేందుకు అవసరమైన నీరు ఎల్లంపల్లిలో ఉందని.. ఆలోగా వర్షాలు కురిసి ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతుందని.. ఒకవేళ అవసరమైతే పార్వతీ పంపుహౌస్ నుంచి నీరు తీసుకుంటామని ఎల్లంపల్లి ప్రాజెక్టు ఈఈ సత్యరాజ్‌చంద్ర తెలిపారు.
ఇదీ చూడండి : ముద్దు పెట్టినందుకు వెంటాడుతున్న కరోనా..