పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ లోని బాత్రూంలో రంగయ్య అనే నిందితుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీనిపై తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల సంఘం, తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం కమిటీ ఆధ్వర్యంలో రంగయ్య కుటుంబసభ్యులు, గ్రామస్తులను కలిసి వివరాలు సేకరించారు. అనంతరం మంథని పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యపై విచారణ నిర్వహించారు.
నిర్బంధించి, వేధించాారు..
రంగయ్యది ఆత్మహత్య కాదని నిజనిర్ధారణ కమిటీ తేల్చి చెప్పింది. 52 గంటలకు పైగా మంథని పోలీసులు అక్రమంగా నిర్బంధించి, వేధించడం వలన చనిపోయినట్లు పేర్కొన్నారు. పోలీసులు తెలిపినట్లు బాత్రూంలో ఉరి వేసుకున్నట్లు ఆనవాళ్లు లేవని.. అది కట్టుకదలా ఉందని వెల్లడించారు. వాస్తవాలు బయటకు రావాలంటే జ్యుడిషియల్ ఎంక్వయిరీ జరిపించాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నిజనిర్ధారణ కమిటీ - సూచనలు
- అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకే పోలీసులు విధులు సక్రమంగా నిర్వర్తించకుండా రంగయ్య మృతికి కారణం అయ్యారని పౌరహక్కుల నేతలు ఆరోపించారు.
- సంబంధిత పోలీసు అధికారులను సస్పెండ్ చేసి.. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
- విద్యుత్ , అటవీ, రెవెన్యూ శాఖ వారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు.. తమ పరిధిలోనే పరిష్కరించుకోవాలి తప్ప.. పోలీస్ శాఖను వాడుకొని అమాయకులపై కేసులు బనాయించడం, బెదిరించడం మంచిది కాదని హితవు పరికారు.
ఇదీ చూడండి: మండుతున్న ఎండలు