వ్యక్తిగతదూరం, వైరస్ నియంత్రణ, జాగ్రత్తలు పాటించి పది పరీక్షలు నిర్వహించే అంశాలను అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాల వారీగా పరీక్ష నిర్వహణ నివేదిక సమర్పించారు. అదనంగా పరీక్షకేంద్రాలను ప్రతిపాదించారు.
పెద్దపల్లి జిల్లాలో 218 పాఠశాలల్లో (125 ప్రభుత్వ, 93 ప్రైవేటు)లో 9207 మంది విద్యార్థులకు 4659 మంది బాలురు, 4548 మంది బాలికలు పరీక్షరాశారు. జిల్లావ్యాప్తంగా 47 పరీక్ష కేంద్రాలు నెలకొల్పారు. మార్చి 19న పరీక్షలు ప్రారంభమై రెండు సబ్జెక్టులు మాత్రమే పూర్తయ్యాయి. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లుచేస్తున్నారు.
అదనపు కేంద్రాలు
పది పరీక్షలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. ఒక్కో బెంచీకి ఒక్కరే విద్యార్థి కూర్చోండే విధంగా చర్యలు చేపట్టారు. జిల్లాలో 47 పరీక్ష కేంద్రాలు ఉండగా అదనంగా మరో 28 కేంద్రాలు అవసరం ఉందని ప్రతిపాదించారు. పరీక్ష కేంద్రాల్లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులను పెంచారు.
జిల్లాలో అత్యధికంగా రామగుండంలో 13 పాత కేంద్రాలతోపాటు అదనంగా 11 కేంద్రాలతో సంఖ్య 24కు పెరిగింది. ఇప్పటి వరకు ఒక్కో గదిలో 20 మంది విద్యార్థులకు పైగా పరీక్ష రాసేది. వ్యక్తిగత దూరం పాటిస్తుండటంతో ప్రస్తుతం 12 మందిలోపు విద్యార్థులు ఉండే అవకాశం ఉంది. అదనంగా పరీక్ష కేంద్రాలు పెరగడంతో ఇన్విజిలేటర్లు అవసరంకానున్నారు. జిల్లాలో 830 మందికిపైగా ఇన్విజిలేటర్ల జాబితా సిద్ధంగా ఉంది.
వైరస్ నియంత్రణ నిబంధనలు కఠినతరం
వాస్తవంగా మార్చి నెలలో జరిగిన పరీక్ష సమయంలోనే విద్యార్థులు మాస్కులు ధరించారు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకునేందుకు పరీక్ష కేంద్రాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం మరింత కఠిన నిబంధనలు అమలు చేయాలని భావిస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లతోపాటు వ్యక్తిగత దూరం పాటించేలా ఏర్పాట్లుచేస్తున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఎన్ని కిలోమీటర్ల నుంచి విద్యార్థులు హాజరవుతున్నారనే సమాచారాన్ని సేకరించారు. విద్యార్థులకు మౌలిక వసతులు సమకూర్చనున్నారు.
ప్రతిపాదనలు రూపొందించాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించాం. ప్రస్తుతం ఉన్న పరీక్ష కేంద్రాల్లోనే అదనంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. జాబితాను విద్యాశాఖకు నివేదించాం.
-జగన్మోహన్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి