పెద్దపల్లి జిల్లా మంథని మీదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ కాటారం మండలాల నుంచి అనేక లారీలు అధిక సంఖ్యలో హైదరాబాద్ వైపు వెళ్తున్నాయి. గత రెండు రోజులు నుంచి ఈ రహదారి మొత్తం లారీలతో నిండిపోయింది. రాకపోకలకు తీవ్ర ఇభ్బందులు ఏర్పడుతున్నాయి. రోడ్లపై ఉన్న గుంతలు చాలవన్నట్లు అధిక సంఖ్యలో వాహనాలు తిరగడంతో చాలా సమస్యలొస్తున్నాయి. చివరకు అంబులెన్స్లకు కూడా లారీల వల్ల దారి దొరకక నానా అవస్థలు పడుతున్నారు.
ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు
మహదేవపూర్, కాటారం మండలాల నుంచి వరంగల్ వైపు వెళ్లే ఇసుక లారీలను భూపాలపల్లి జిల్లా పాలనాధికారి ఆదేశాలతో మంథని వైపు మళ్ళించారు. అందువల్ల లారీలు అధిక సంఖ్యలో మంథని వైపు వస్తున్నాయి.మరో పక్కన మంథని పెద్దపల్లి రహదారి మరమ్మతులు జరుగుతుండటం వల్ల ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇసుక లారీల రాకపోకలను ఈ మార్గంలో అనుమతించడం లేదు.
పగలు రోడ్ల పక్కన.. రాత్రిళ్లు రోడ్లపై
మంథని మీదుగా గోదావరిఖని వైపు లారీలను మళ్ళిస్తుండడం వల్ల బసంత్ నగర్ వద్ద టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుందని, గోదావరిఖని మీదుగా వెళితే దూర భారం అని భావించి ఇసుక లారీ డ్రైవర్లు సాయంత్రం వరకు మంథని కాటారం పరిసర ప్రాంతాల్లో రహదారుల ప్రక్కన నిలుపుతున్నారు. ఈ లారీలు ఇష్టారీతిగా రోడ్లపై ప్రయాణించడం వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద పెద్ద ప్రమాదాలు జరగక ముందే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చూడండి: కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజినీరింగ్ కృషి అభినందనీయం: గవర్నర్