పెద్దపల్లి జిల్లా రామగిరి మండల పరిధిలోని సింగరేణి బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయటాన్ని నిరసిస్తూ... కార్మికులు సమ్మె చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగించనున్న ఈ సమ్మెలో పెద్దఎత్తున కార్మికులు పాల్గొన్నారు. ఆర్జీ- 3, ఉపరితల బొగ్గుగనిలో ఉదయం, జనరల్ షిఫ్టులో కలిపి 25 శాతం మంది కార్మికులే విధులకు హాజరయ్యారు. భూగర్భ, ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ఎలాంటి సందడి వాతావరణం కనిపించలేదు.
సమ్మె కారణంగా గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కార్మిక సంఘాల నాయకులు గనుల వద్దకు వెళ్లి నిరసనలు తెలుపుతారనే అనుమానంతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ ఆలోచనను మానుకోవాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పిలుపు మేరకు సమ్మె చేస్తూ కార్మికుల హక్కులను సాధించుకుంటామని పేర్కొన్నారు.