Singareni Medical College: రామగుండం ప్రాంతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రాంత ప్రజల దీర్ఘకాలిక కోరిక నెరవేరే శుభతరుణం ఆసన్నమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సింగరేణి సంస్థ 500 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ కొత్తగూడెంలో జరిగిన చారిత్రాత్మక సింగరేణి 100వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో బోర్డ్ తన అంగీకారం తెలిపింది. దీంతో రామగుండం ఏరియాలో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు ఖరారైంది.
ముఖ్యమంత్రి సూచన మేరకు..
రామగుండం ప్రాంతంలో వైద్య కళాశాలతో పాటు పూర్తి స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నామని రెండేళ్ల క్రితం సీఎం కేసీఆర్ శ్రీరాంపూర్ ఏరియాలో జరిగిన సింగరేణీయుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రకటించారు. తద్వారా ఈ ప్రాంత ప్రజలకు, కార్మికులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో సింగరేణి సంస్థ ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి 500 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి సూచించగా.. సంస్థ సీఎండీ శ్రీధర్ దీనిపై ప్రత్యేక చొరవ తీసుకొని ఈ నెల 10వ తేదీన బోర్డు ఆఫ్ డైరెక్టర్ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఉంచగా, దీనికి బోర్డు తన ఆమోదం తెలిపింది. ఇవాళ జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో కూడా ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవ ఆమోదం లభించింది.
నెరవేరనున్న చిరకాల స్వప్నం
సింగరేణి నిధులతో ఏర్పాటు చేసే ఈ వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో హైదరాబాద్ వంటి పట్టణాల్లో లభించే అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు కూడా అందజేయనున్నారు. దీనివల్ల సింగరేణి కార్మికులు, రిటైర్ అయిన కార్మికులు, వారి కుటుంబీకులకే కాకుండా పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాంత విద్యార్థులకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ అందుబాటులో ఉండాలన్న కార్మికుల, స్థానికుల చిరకాల కోరిక మరో రెండేళ్లలో సాకారం కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు సింగరేణి తరఫున సీఎండీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చదవండి:
Harish Rao on Booster dose: 'మనమే ముందున్నాం.. బూస్టర్ డోసుకు అన్ని ఏర్పాట్లు చేయాలి'