Satavahana Landmarks:పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంట గ్రామంలో శాతవాహనుల కాలం నాటి ఇటుక గోడలు, పురావస్తు అవశేషాల్ని గుర్తించినట్లు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, చరిత్ర పరిశోధన సంస్థ ‘ప్రిహా’ ప్రతినిధుల బృందం వెల్లడించింది. స్థానిక సమ్మక్క, సారలమ్మ గుట్టపై పెద్ద ఇటుకలతో నిర్మితమైన రెండు గోడల వరుసల్ని వెలికితీయడంతో శాతవాహనుల కాలం నాటి అవశేషాలు బయటపడ్డాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యుడు డాక్టర్ ఎం.ఎ.శ్రీనివాసన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
‘ఇటుకలతో కూడిన నిర్మాణం పక్కనే చెరువు ఉండటంతో దీన్ని ఆ కాలంలో నీటివనరుగా వినియోగించి ఉండవచ్చని తెలుస్తోంది. పరిసరాల్లో గూనలు, మట్టి కుండల ముక్కలు పెద్దఎత్తున లభ్యమయ్యాయి. ఈ దిబ్బ కింద సుమారు 200 ఎకరాల్లో జనావాసం ఆధారాలు దొరికే అవకాశం ఉంది’ అని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. ఇదే గ్రామంలో గతంలో 5వ శతాబ్దానికి చెందిన విష్ణుకుండి నాణెం దొరికింది అని ఆయన తెలిపారు. ఈ పరిశోధక బృందంలో భానుమూర్తి, రవితేజ ఉన్నారు.
ఇదీ చదవండి: