ఎండాకాలంలో మూడు నాలుగు నెలలు సరిగా నీటి లభ్యత లేకపోవడం వల్ల అడవిలోని వన్యప్రాణులు అల్లాడిపోతున్నాయి. కొన్ని చోట్ల జంతువులు మరణిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని రేంజ్ అటవీ పరిధిలో వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేకంగా సాసర్పిట్స్లను ఏర్పాటు చేస్తున్నారు అటవీ అధికారులు. సాసర్ పిట్స్ లోతు ఎక్కువగా ఉండకుండా సులువుగా నీరు తాగేవిధంగా ఉండడం వల్ల అడవిలోని జంతువులు పక్షులు నీరు తాగేందుకు వస్తున్నాయి.
మంథని అటవీ రేంజ్ పరిధిలోని అడవులలో అటవీ అధికారులు సర్వే నిర్వహించారు. నీటి లభ్యత లేని ప్రదేశాలైన గాజులపల్లి, బట్టుపల్లి, ఆరెంద, గోపాల్పూర్, మైదంబండ ప్రాంతాలను గుర్తించారు. ఈ ప్రదేశాల్లో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు 5సాసర్ పిట్స్లను ఏర్పాటుచేసి ట్యాంకర్ల ద్వారా శుభ్రమైన నీటిని నింపుతున్నారు. వారానికి ఒకసారి శుభ్రం చేస్తూ రెండు రోజులకోసారి నీటితో నింపుతూ వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ అటవీ ప్రాంతంలో ఎక్కువగా కొండ గొర్రెలు, కుందేళ్లు, జింకలు, అడవి పిల్లులు, మేకలు, పక్షులు మనుబోతులు సంచరిస్తాయని అధికారులు తెలిపారు.
ముందు ముందు మరి కొన్ని చోట్ల కూడా వీటిని నిర్మించేందుకు అధికారులు సిద్ధం చేసుకుంటున్నారు.
ఇవీ చూడండి: కోడిపెట్ట... కౌజుపిట్ట... ఏది కావాలి?